ప్యాన్ సౌత్ సినిమా… చాలా మంచి మాట ఇది

ప్యాన్ ఇండియా పేరుతో ప్రతి హీరో వరల్డ్ బిల్డింగ్, ఎలివేషన్ల వెనుక పడటంతో సినిమాల వేగం తగ్గిపోయింది. టయర్ 2, 3 హీరోలు కూడా ఏడాదికి రెండు రిలీజ్ చేయడమే మహా కష్టంగా ఫీలవుతున్నారు. దర్శకుల ధోరణి, రాజీపడలేని మనస్తత్వం, అంతకంతా పెరిగిపోతున్న బడ్జెట్లు, ఓటిటి మీద మితిమీరిన నమ్మకాలు ఇవన్నీ అవుట్ ఫుట్ మీద ప్రభావం చూపిస్తున్నాయి. ఇది ఒక ఎత్తు అయితే అన్ని భాషల జనాలను మెప్పించాలనే తాపత్రయంతో డైరెక్టర్లు పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావు.

ఎక్కడెక్కడి నుంచో ఆర్టిస్టులను తీసుకొచ్చి భారీ రెమ్యునరేషన్లు భరించి కోట్లు కుమ్మరించడం పరిపాటిగా మారింది. తాజాగా మైత్రి రవిశంకర్ ఈ విషయంలో చేసిన కామెంట్లు ఆసక్తికరంగా ఉన్నాయి. మనకు ప్యాన్ ఇండియా వద్దని, ప్యాన్ సౌత్ మంత్రంతో తమిళ సినిమాలు తీసి వాటిలో కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులను ఖచ్చితంగా ఆదరిస్తారని, పక్క బాష కోసం అవసరం లేనివి అవి ఇవి కలపవద్దని సలహా ఇచ్చారు. ఈ స్టేట్ మెంట్ కొంచెం విశ్లేషించుకుని చూద్దాం.

ఒకప్పుడు తమిళ మళయాళ సినిమా ఏదైనా సరే నేరుగా డబ్బింగ్ చేసేవాళ్ళు. ఎలాంటి అదనపు హంగులు ఉండేవి కాదు. మణిరత్నం, బాలచందర్, కెఎస్ రవికుమార్, సురేష్ కృష్ణ ఇలాంటి అవసరం లేని ప్రయోగాలు చేసే వాళ్ళు కాదు. అందుకే నాయకుడు, ఘర్షణ, జెంటిల్ మెన్, బాషా, నరసింహ లాంటివి కోలీవుడ్ ఆర్టిస్టులతోనే తెలుగులో బ్లాక్ బస్టర్లు సాధించాయి. గౌండమణి, వడివేలు, సెంథిల్ లాంటి నటులకు మన దగ్గరా చాలా ఆర్గానిక్ గుర్తింపు ఉండేది.

ఇప్పుడు కూడా ఇలాంటి పద్దతే కావాలని కోరుతున్నారు రవిశంకర్. ఒరిజినల్ ని ఒరిజినల్ లా ఇస్తే తమ ఆడియన్స్ విజయం అందిస్తారని కుండబద్దలు కొట్టారు. ఇటీవలే వచ్చిన బెత్లెహాం కుటుంబ యూనిట్ కంటే ఉదాహరణ ఏం కావాలి. ఖైదీ, తుపాకీలో ఉన్నదంతా తమిళ బ్యాచే. అయినా అద్భుత ఫలితాలు అందుకున్నాయి. సో నేటివిటీ సరిగా ఉంటే అది ఏ లాంగ్వేజ్ నుంచి వచ్చిందనేది జనాలకు అనవసరం. మెప్పిస్తే చాలు డబ్బింగ్, స్ట్రెయిట్ తేడా లేకుండా హిట్లు ఇచ్చేస్తారు.