సూర్య‌తో సినిమా ఎప్పుడు… రాజ‌మౌళి జ‌వాబేంటి?

రాజ‌మౌళితో సినిమా చేయాల‌ని ఇప్పుడు ఇండియాలో ఉన్న‌ ప్ర‌తి పేరున్న హీరో ఆశ‌ప‌డుతుంటాడు అన‌డంలో సందేహం లేదు. ఐతే రాజ‌మౌళి సినిమా చేయాలి అనుకుని చేయ‌లేక‌పోయిన హీరోలు కూడా కొందరున్నారు. అందులో త‌మిళ స్టార్ సూర్య ఒక‌డు. త‌న కెరీర్‌ను మ‌లుపు తిప్పిన మ‌గ‌ధీర సినిమానే సూర్య‌తో చేయాల‌నుకున్నాడు రాజ‌మౌళి ఒక‌ప్పుడు. కానీ అది సాధ్య‌ప‌డ‌లేదు. త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్‌తో ఆ సినిమా తీసి ఇండ‌స్ట్రీ హిట్ కొట్టాడు.

ఐతే ఆ త‌ర్వాత ఏదో ఒక సినిమాకు రాజ‌మౌళి, సూర్య జ‌ట్టు క‌డ‌తారేమో అని చూశారు. ఇప్ప‌టిదాకా అది జ‌ర‌గ‌లేదు. భ‌విష్య‌త్తులో ఏమైనా సాధ్య‌ప‌డుతుందేమో తెలియ‌దు. ఐతే త‌న కొడుకు కార్తికేయ ప్రొడ్యూస్ చేసిన డోంట్ ట్ర‌బుల్ ద ట్ర‌బుల్ త‌మిళ వెర్ష‌న్ ప్ర‌మోష‌న్ల కోసం రాజ‌మౌళి చెన్నైకి వెళ్లగా.. ఆ ఈవెంట్‌కు సూర్య అతిథిగా వ‌చ్చాడు. ఈ ఇద్ద‌రూ చాలా ఆత్మీయంగా వ్య‌వ‌హ‌రించిన ఈ వేడుక‌లో.. ఈ కాంబోలో సినిమా గురించి యాంక‌ర్ నుంచి ప్ర‌శ్న ఎదురైంది.

ఈ ప్ర‌శ్న‌కు భ‌లే తెలివిగా బ‌దులిచ్చాడు రాజ‌మౌళి. ఈ ఈవెంట్లో త‌న‌కు ఈ క్వ‌శ్చ‌న్ ఎదుర‌వుతుంద‌ని త‌న‌కు ముందే తెలుస‌ని, అందుకే ప్రిపేరై వ‌చ్చాన‌ని రాజ‌మౌళి చెప్ప‌డంతో.. ఏదో క్రేజీ అప్‌డేట్ ఇస్తాడేమో అని అంతా ఎదురు చూశారు. కానీ ఆశ దోసె అప్ప‌డం అన్న‌ట్లుగా.. నేను సూర్య‌తో సినిమా ఎప్పుడో చెబితే అది హెడ్‌లైన్ అయిపోతుంద‌ని, డోంట్ ట్ర‌బుల్ ద ట్రబుల్ సినిమా ఫోక‌స్ నుంచి ప‌క్క‌కు వెళ్లిపోతుంద‌ని, కాబ‌ట్టి దాని గురించి ఏమీ మాట్లాడ‌న‌ని అనేశాడు జ‌క్క‌న్న‌. ఐతే తాను, సూర్య ఎప్పుడు క‌లిసి సినిమా చేసినా అది చాలా స్పెషల్‌గా ఉంటుంద‌ని రాజ‌మౌళి చెప్పాడు.

ఇక సూర్య ఇటీవ‌లి సూప‌ర్ ఫామ్ గురించి జ‌క్క‌న్న కొనియాడాడు. ఈ ఏడాది క‌రుప్పు, విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ చిత్రాల‌తో డ‌బుల్ ధమాకా స‌క్సెస్ అందుకున్నందుకు సూర్య‌కు కంగ్రాట్స్ చెప్పాడు రాజ‌మౌళి. ఇంత‌కుముందు సింగం సినిమాలో మాస్ పోలీస్‌గా అల‌రించిన సూర్య‌.. సీన్ మూవీలో న్యూ ఏజ్ కాప్‌గా అల‌రించ‌బోతున్నాడ‌ని.. ఆ సినిమా టీజ‌ర్ త‌న‌కు చాలా న‌చ్చింద‌ని, సీన్ సినిమా కోసం అంద‌రికంటే ఎక్కువ‌గా తాను ఎదురు చూస్తున్నాన‌ని చెప్పాడు రాజ‌మౌళి.