అమ్మ చేతులు అడుక్కోకూడదు

తెలుగులో లెజెండరీ స్టేటస్ ఉన్న దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకడు. బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, శివమణి, పోకిరి, దేశముదురు, చిరుత.. ఇలా ఒకప్పుడు ఆయన హిట్ స్ట్రీక్ మామూలుగా సాగలేదు. కానీ కెరీర్ సెకండాఫ్‌లో ఆయన వరుస ఫ్లాపులతో బాగా వెనుకబడ్డారు. ‘టెంపర్’ తర్వాత ఆయన ముద్ర కనిపించలేదు. ‘ఇస్మార్ట్ శంకర్’ హిట్టయినా అది ఫ్లూక్ హిట్ అనే అభిప్రాయం పడిపోయింది. అందుకు తగ్గట్లే తర్వాత లైగర్, డబుల్ ఇస్మార్ట్ డిజాస్టర్లు అయ్యాయి.

ఈ రెండు చిత్రాల తర్వాత గ్యాప్ తీసుకుని చేసిన ‘స్లమ్ డాగ్’ సినిమా విడుదలకు నోచుకోకుండా ఆగిపోయింది. షూటింగ్ పూర్తయి చాలా కాలమే అయినా.. ఈ సినిమా రిలీజ్‌ కావట్లేదు. కొన్ని నెలలుగా అసలు ఏ అప్‌డేట్ రాలేదు. పూరి గత సినిమాలకు సంబంధించిన సెటిల్మెంట్ల ప్రభావం ఈ చిత్రం మీద పడిందంటున్నారు. అలాగే దీని కంటే ముందు విజయ్ సేతుపతి ‘బత్తా’ సినిమాను రిలీజ్‌కు రెడీ చేయడం కూడా దీనికి అడ్డంకిగా మారింది. ఐతే ‘బత్తా’ రిలీజైపోయింది. ఆశించిన స్పందన కూడా తెచ్చుకోలేదు. ఇప్పుడు ఫోకస్ ‘స్లమ్ డాగ్’ పైకి మళ్లింది.

త్వరలో ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు సంకేతాలిస్తూ.. ఒక ప్రోమో వదిలాడు పూరి జగన్నాథ్. ‘ది రాజాసాబ్’లో హీరో బామ్మగా కీలక పాత్ర చేసిన ప్రముఖ బాలీవుడ్ నటి జరీనా వాహబ్ పాత్రకు సంబంధించిన వీడియో ఇది. ఇందులో ఆమె బిక్షగత్తె పాత్ర చేస్తోంది. అయిన వాళ్లందరికీ దూరమై రైలుకింద పడి చచ్చిపోదామనుకున్న ఒక పెద్దావిడ.. చివరికి నిర్ణయం మార్చుకుని, కడుపు నింపుకోవడానికి ఎలా బిక్షగత్తెగా మారిందన్నది ఈ ప్రోమోలో చూపించారు.

ఈ టీజర్ చాలా హృద్యంగా సాగి బలమైన ఎమోషన్ రాబట్టింది. ముఖ్యంగా అడుక్కోవడానికి చేతులు చాచే షాట్ బాగా పేలింది. చివర్లో అమ్మ చేతులు అన్నం పెట్టాలే కానీ అడుక్కోకూడదు అంటూ పూరి వాయిస్ ఓవర్ కొసమెరుపు. స్లమ్ డాగ్‌లో ఎమోషనల్ యాంగిల్ బలంగానే ఉండబోతోందని ఈ టీజర్ సంకేతాలిచ్చింది. ఇలాంటివే మరికొన్ని ప్రోమోలు రిలీజ్ చేసి వీలైనంత త్వరగా సినిమాను విడుదలకు సిద్ధం చేస్తే మంచిది.