బాలయ్య కొడుకు కోసం కొత్త ముహూర్తం?

మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ రెండు దశాబ్దాల కిందటే తెరంగేట్రం చేశాడు. అక్కినేని నాగార్జున ఇద్దరు కొడుకులూ ఒకరి తర్వాత ఒకరి హీరోలైపోయారు. విక్టరీ వెంకటేష్ తనయుడు ఇంకా చిన్నవాడే కాబట్టి అతడి అరంగేట్రానికి చాలా టైం ఉంది. కానీ ఆ తరం హీరోల్లో ఒకడైన నందమూరి బాలకృష్ణ మాత్రం తన కొడుకు మోక్షజ్ఞను ఇంకా సినిమాల్లోకి తీసుకురాలేకపోయాడు. అతడికి హీరో అయ్యే వయసొచ్చి చాలా ఏళ్లయింది.

తన అరంగేట్రం గురించి దశాబ్దం కిందట్నుంచే చర్చ జరుగుతోంది. ఇదిగో అదిగో అంటున్నారే తప్ప మోక్షజ్ఞ తొలి సినిమా ముందుకు కదలడం లేదు. రెండేళ్ల ముందు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమాను అనౌన్స్ చేసి కూడా ఆపేయాల్సి వచ్చింది. ఆ తర్వాత మోక్షజ్ఞ తొలి సినిమా దర్శకుడిగా కొన్ని పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఎవ్వరూ ఫిక్సవ్వలేదు. ఏ సినిమా సెట్ కాలేదు.

ఐతే ఎట్టకేలకు మోక్షజ్ఞ అరంగేట్ర సినిమా విషయంలో బాలయ్య తుది నిర్ణయం తీసుకున్నట్లుగా ఓ ప్రచారం నడుస్తోంది. బాలయ్యకు ముహూర్తాల మీద ఎంతో గురి అన్న సంగతి తెలిసిందే. తన కొడుకు తొలి సినిమా విషయంలోనూ ఆయన ఒక కొత్త ముహూర్తం పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. దసరాకు మోక్షు కొత్త సినిమాకు పూజ జరిపించాలని బాలయ్య భావిస్తున్నారట.

మోక్షు తొలి చిత్రానికి దర్శకుడు ఫిక్స్ అయ్యాడని.. కథ మీద కసరత్తులు జరుగుతున్నాయని.. సినిమాను మొదలుపెట్టడానికి ఇంకొంత సమయం పడుతుందని.. ఐతే ఈ లోపు దసరాకు ముహూర్త వేడుకను ఘనంగా జరిపించి మోక్షజ్ఞ తొలి చిత్రాన్ని ప్రకటిస్తారని అంటున్నారు.

ప్రశాంత్ వర్మ సినిమా విషయంలో యుటర్న్ తీసుకున్నట్లుగా ఈసారి జరగకుండా.. మోక్షును సర్వసన్నద్ధం చేశాకే రంగంలోకి దించబోతున్నారని బాలయ్య సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంలో త్వరలో ఫుల్ క్లారిటీ వస్తుందంటున్నారు. మరి ఈసారైనా మోక్షజ్ఞ అరంగేట్ర సినిమా నిజంగా ముందుకు కదలుతుందా లేక నందమూరి అభిమానుల నిరీక్షణ కొనసాగుతుందా అన్నది చూడాలి.