ఆల్ టైం కామెడీ బ్లాక్ బస్టర్.. తెరవెనుక కథ

తెలుగులో వచ్చినన్ని కామెడీ సినిమాలు మరే భాషలోనూ రాలేదంటే అతిశయోక్తి కాదు. జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ, రేలంగి నరసింహారావు లాంటి దర్శకులు ఒకప్పుడు కేవలం కామెడీ సినిమాలే తీసేవారు. ఆ తర్వాత కూడా చాలామంది దర్శకులు ఈ ఒరవడిని అందిపుచ్చుకున్నారు. కామెడీ చిత్రాలతో పెద్ద హీరోల సినిమాల వసూళ్లను కూడా మ్యాచ్ చేయొచ్చని రుజువు చేసిన దర్శకుల్లో ఈవీవీ ఒకరు.
ఆయన రూపొందించిన ‘జంబలకిడిపంబ’ 90వ దశకంలో చాలా పెద్ద హిట్టే అయింది.

ఈ సినిమా వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీని ఇందులో లీడ్ రోల్ చేసిన సీనియర్ నటుడు నరేష్.. ఈవీవీ తనయుడు అల్లరి నరేష్‌తో కలిసి చేసిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సినిమాలో ఒక సన్నివేశాన్ని ముందే లెజెండరీ దర్శకుడు జంధ్యాల వాడుకున్నారట. అలాగే ‘జంబలకిడిపంబ’కు ముందు అనుకున్న టైటిల్ అది కాదట. ఇంకా నరేష్ ఈ సినిమా గురించి చెప్పిన విశేషాలేంటంటే…

‘‘ఈవీవీ, నేను బాగా క్లోజ్. ఆయన నన్ను నరి అనేవాడు. నేను ఆయన్ని సత్యం అనేవాడిని. నేను జంధ్యాల దర్శకత్వంలో మొగుడు పెళ్ళాలు సినిమా చేస్తున్నపుడు ఈవీవీ ఆయన దగ్గర ఫస్ట్ అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేసేవారు. సత్యం 1983-84 టైంలోనే జంబలకిడిపంబ సినిమా కథ రాసేశాడు. అప్పుడే అంత అడ్వాన్స్డ్‌గా, ఔట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించేవారు. ఈ కథ జంధ్యాల గారికి కూడా నచ్చి.. ఇందులో ఒక సన్నివేశం అడిగి మరీ మొగుడూపెళ్ళాలు సినిమాలో పెట్టించుకున్నారు. ఆ తర్వాత చాలా ఏళ్లకు నాకు సత్యం జంబలకిడిపంబ కథ చెప్పాడు. నాకు విపరీతంగా నచ్చేసింది.

మా కాంబినేషన్లో అదే తొలి సినిమా కావడంతో చాలా ఎగ్జైట్ అయ్యాను. ఈ కథకు ఈవీవీ ముందు చెప్పిన టైటిల్.. రివర్స్ గేర్. కానీ మనం కలిసి తొలి సినిమా చేస్తున్నాం.. దీనికి రివర్స్ గేర్ అనే టైటిల్ ఓకేనా అని నేను కొంచెం తటపటాయించాను. కొంచెం ఆలోచించు అని చెప్పాను. మరుసటి రోజు పొద్దు పొద్దునే సత్యం నాకు ట్రంక్ కాల్ చేశాడు. ఫోన్ తీయగానే ‘జంబలకిడి పంబ’ అన్నాడు. ఏంటి అంటే ఇంకోసారి ఆ పేరు చెప్పాడు. మళ్లీ ఏంటది అంటే.. మన సినిమా టైటిల్ అన్నాడు. అదిరిపోయింది అని చెప్పాను. అలా జంబలకిడిపంబ సినిమా మొదలైంది. రిలీజ్ తర్వాత సెన్సేషన్ క్రియే్ట చేసింది’’ అని నరేష్ తెలిపాడు.