సూర్య ఛెప్పిన కార్తి ‘పొటాటో చిప్స్’ కథ

సౌత్ ఇండియన్ సినిమాలో మోస్ట్ సెలబ్రేటెడ్ సినీ బ్రదర్స్‌లో సూర్య-కార్తి ద్వయం ముందు వరుసలో ఉంటుంది. వీళ్లిద్దరూ తండ్రి శివకుమార్ ఛాయలు తమ మీద పడనివ్వకుండా సొంతంగా తమకంటూ ఒక స్టైల్ క్రియేట్ చేసుకున్నారు. సూర్య పెద్ద స్టార్‌గా వెలుగొందుతున్న టైంలో హీరోగా అరంగేట్రం చేసిన కార్తి.. తొలి చిత్రం ‘పరుత్తి వీరన్’తోనే తన రూటే సపరేటు అని రుజువు చేశాడు. ఆ తర్వాత అతను ఎంత పెద్ద స్టార్‌గా ఎదిగాడో, తెలుగులో కూడా ఎలాంటి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడో తెలిసిందే.

ఐతే చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. సినిమాల్లోకి రావడానికి ముందు కార్తి యుఎస్‌లో జాబ్ చేసేవాడు. సినిమాల్లో నటిద్దామని చెన్నైకి తిరిగి వచ్చినపుడు అతను బాగా లావుగా, ఏమాత్రం హీరో లుక్స్ లేకుండా ఉండేవాడు. కానీ సినిమా కోసం అతను ఎంత కష్టపడి ట్రాన్స్‌‌ఫామ్ అయ్యాడో కార్తి కొత్త సినిమా ‘సర్దార్-2’ ప్రి రిలీజ్ ఈవెంట్లో సూర్య వెల్లడించాడు.

యుఎస్ నుంచి వచ్చినపుడు కార్తి బాగా లావుగా ఉండేవాడని.. యుఎస్‌లో రైస్ బ్యాగ్ సైజులు పొటాటో చిప్స్ ఉంటాయని.. చెన్నైకి వచ్చాక కూడా తమ ఇంట్లో సోఫాలో కూర్చుని రైస్ బ్యాగ్ సైజులో చిప్స్ ప్యాకెట్ పెట్టుకుని తింటూ ఉండేవాడని.. అలాంటివాడు ‘పరుత్తి వీరన్’ లాంటి ఓ మంచి అవకాశం లభించగానే, మొత్తం మారిపోయాడని.. షాకింగ్ ట్రాన్స్‌ఫామ్‌తో తనను ఆశ్చర్యపరిచాడని.. ఆ తర్వాత ఒక్కో సినిమా కోసం అతను ఎంత కష్టపడ్డాడో తనకు తెలుసని సూర్య అన్నాడు.

కార్తికి, తనకు మధ్య అసలు అసూయ అన్నదే ఉండదని ఈ సందర్భంగా సూర్య చెప్పాడు. చాలామంది తనతో మాట్లాడుతున్నపుడు.. కార్తి గురించి అడుగుతారని, అతడి నటనను అభినందిస్తూ మాట్లాడతారని సూర్య చెప్పాడు. తమ ఇంటికి వచ్చేవాళ్లు కూడా తన కంటే ఎక్కువగా కార్తి కోసమే వస్తారంటూ సూర్య చెప్పడం విశేషం. తమ్ముడు ఎంచుకునే కథలు, పాత్రలు చూసి తనకు గర్వంగా ఉంటుందని సూర్య ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు.