రెండో భాస్కర్ అంత వేగంగా రాగలడా

సోలో హీరోగా దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాతోనూ వంద కోట్లు వసూలు చేయగలడని నిరూపించిన లక్కీ భాస్కర్ కొనసాగింపు గురించి ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. దర్శకుడు వెంకీ అట్లూరి మార్కెట్ ని అమాంతం పెంచేసి విశ్వనాథ్ అండ్ సన్స్ రూపంలో సూర్యతో చేసే ఛాన్స్ దక్కించుకోవడం చిన్న విషయం కాదు. వీటి కన్నా ముందు ధనుష్ కి సర్ రూపంలో సాలిడ్ హిట్ ఇవ్వడం ఫ్యాన్స్ త్వరగా మర్చిపోలేరు. అందుకే వెంకీ మంచి ఊపులో ఉన్నారు.

దుల్కర్ కొత్త చిత్రం ఐయామ్ గేమ్ రేపు విడుదల కానుంది. తమిళ మళయాళంతో పాటు తెలుగు వెర్షన్ కూడా సమాంతరంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో యాంకర్ గా వచ్చిన వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ 2 ప్రస్తావన తెచ్చారు. సీక్వెల్ కోసం చాలా మంది అడుగుతున్నారని, వీలైనంత త్వరగా స్క్రిప్ట్ కుదరగానే కలుస్తానని చెప్పారు. దీనికి దుల్కర్ సల్మాన్ స్పందిస్తూ ఎక్కడికి వెళ్లినా తన అసలు పేరు కాకుండా భాస్కరని పిలుస్తున్నారని చెప్పుకొచ్చాడు.

సరే వినడానికి బాగుంది కానీ, నిజంగా లక్కీ భాస్కర్ 2 కార్యరూపం దాలిస్తే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది. వెంకీ అట్లూరి ప్రస్తుతం కొత్త కమిట్ మెంట్స్ ఎవరికీ ఇవ్వలేదు. నాగచైతన్య పేరు బాగా వినిపిస్తోంది. సితార సంస్థలోనే దీన్ని తీసేందుకు ప్రాధమికంగా ఓకే అనుకున్నారట. అయితే కథ పూర్తి స్థాయిలో రెడీ కాకపోవడంతో కొంచెం టైం పడుతుంది. ఈలోగా ఇంకెవరైనా ఛాయస్ ఉన్నారా లేక నిర్మాత నాగవంశీ ఏదైనా క్రేజీ కాంబో సెట్ చేస్తారాని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఆర్థిక నేరాల బ్యాక్ డ్రాప్ లో నడిచే లక్కీ భాస్కర్ క్లైమాక్స్ ఓపెన్ గా వదిలేశారు. హీరో విదేశాలకు వెళ్లిన తర్వాత మళ్ళీ ఇండియాకు వచ్చాడా లేక విదేశాల్లో ఏదైనా వైట్ కాలర్ క్రైమ్ చేశాడా అనే దాని మీద రకరకాల ఊహాగానాలు అయితే ఉంటాయి. వెంకీ అట్లూరి మాత్రం ఎక్కడ మాట్లాడినా ఎక్కడో ఒక  చోట దీని ప్రస్తావన తెస్తూనే ఉన్నారు. రెండేళ్లు గడిచిపోయాయి కాబట్టి నిజంగా లక్కీ భాస్కర్ ఏం చేస్తాడనే ఆలోచనతో సినిమా తీయొచ్చు. చూడాలి మరి రెండో భాస్కర్ ఎప్పుడు వస్తాడో.