ఏంటో జెన్ జీ ఆడియన్స్ మహా విచిత్రంగా ఉన్నారు. కొన్ని కొత్త సినిమాలను అస్సలు పట్టించుకోరు. కొన్ని రీ రిలీజులకేమో కనక వర్షం కురిపిస్తారు. అందులోనూ పవన్ కళ్యాణ్ మూవీ అంటే చెప్పేదేముంది. అయితే గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్టో లేకా ఖుషి లాంటి రికార్డు బ్రేకరో అంటే ఏమో అనుకోవచ్చు. కానీ మొదటిసారి వచ్చినప్పుడు ఫెయిల్యూర్ గా నిలిచిన పంజాకి వస్తున్న అనూహ్య స్పందన చూసి బయ్యర్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఎందుకంటే బుకింగ్స్ ఆ స్థాయిలో ఉన్నాయి.
పవన్ పుట్టినరోజు కాబట్టి విడుదల ఇవాళే అయినా నిన్న సాయంత్రం నుంచే చాలా చోట్ల ప్రీమియర్లు వేసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. హైదరాబాద్ విమల్ థియేటర్ లో ఇరుముడికి బ్రేక్ ఇచ్చి మరీ పంజాని వేశారంటే క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ మానియా కేవలం హైదరాబాద్ కే పరిమితం కాలేదు. జిల్లా కేంద్రాలు, పట్టణాలు, చిన్న సి సెంటర్లు అన్ని చోట్ల ఇదే సీన్ ఉంది. అర్ధరాత్రి నుంచే సంబరాలు చేసుకోవడంలో ఫ్యాన్స్ తలమునకలై ఉన్నారు.
నిజానికి పంజా అప్పట్లో ఫ్లాప్ కావడం వెనుక చాలా కారణాలున్నాయి. ఇంత సీరియస్ గ్యాంగ్ స్టర్ డ్రామాని జనం ఎక్స్ పెక్ట్ చేయలేదు. దర్శకుడు విష్ణు వర్ధన్ సెకాండాఫ్ ని హ్యాండిల్ చేసిన విధానం, కొత్త హీరోయిన్ మైనస్ కావడం లాంటి ప్రతికూల అంశాలు అసంతృప్తికి దారి తీశాయి. బిల్లా లాగా ఒకే టెంపోలో తీసి ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అయ్యేదని మూవీ లవర్స్ ఇప్పటికీ చెబుతారు. యువన్ శంకర్ రాజా ఇచ్చిన టెర్రిఫిక్ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకా బాగా ఉపయోగపడేవి.
ఏమైనా ఒకప్పుడు కోల్పోయిన స్టేటస్ పంజాకు మళ్ళీ వచ్చింది. కేవలం పవన్ ఫ్యాన్స్ ఒకటే కాదు ఇలాంటి మాస్ కంటెంట్ తెరమీద చూడాలని కోరుకునే సినీ ప్రియులు చాలా మంది ఇవాళ పంజాకు వెళ్లిపోయారు. ఇరుముడి స్పీడ్ ఇంకా తగ్గకపోయినా టాక్సిక్ ఎఫెక్ట్ వల్ల తగినన్ని షోలు పంజాకు అందుబాటులో ఉన్నాయి. కొన్ని చోట్ల డిమాండ్ మేరకు అదనంగా జోడించాల్సి వచ్చింది. ఆరెంజ్, ఖలేజాను మించిన వసూళ్లు రావొచ్చని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates