బాక్సాఫీస్ వద్ద టాక్సిక్ ఎదురీదుతున్న వైనం ఒకవైపు, కావాలని కొందరు నెగటివ్ పబ్లిసిటీ చేస్తున్నారని కన్నడ మూవీ లవర్స్ కొందరు నిరసన వ్యక్తం చేయడం మరోవైపు సోషల్ మీడియాని కమ్మేస్తోంది. ఇది ఎక్కడిదాకా వెళ్లిందంటే శాండల్ వుడ్, టాలీవుడ్ లో ఏది గొప్పని డిబేట్లు పెట్టుకునే దాకా పాకిపోయింది. ఈ నేపథ్యంలో యష్ తల్లి పుష్ప గారు తాజాగా మీడియా ముందు చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. పేర్లు ప్రస్తావించకుండా కొందరికి కౌంటర్లు కూడా ఇచ్చారు.
కొందరు ఉద్దేశపూర్వకంగా టాక్సిక్ మీద చెడు ప్రచారం కొనసాగిస్తున్నారని, దీన్ని ప్రశ్నించడం బాధ్యతగా మీ ముందుకు వచ్చానని చెప్పి, కష్టపడి ఇంతపైకి వచ్చిన కొడుకుని ఇలా టార్గెట్ చేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాదు ఇతర భాష నిర్మాత ఒకరు కెజిఎఫ్ కన్నా ముందు యష్ ఎవరని కామెంట్ చేశారని, తన బిడ్డ ట్రాక్ రికార్డు, అంతకు ముందు హిట్ల గురించి తెలుసుకోవాలంటే ఇక్కడకి వచ్చి కనుక్కోవాలని కౌంటర్ ఇచ్చారు. మొత్తానికి ఆవిడ ఆవేదనలో న్యాయముంది.
కానీ యష్ తల్లి కూడా ప్రాక్టికల్ గా ఒప్పుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. టాక్సిక్ ఎవరు బ్యాడ్ చేశారనేది పక్కన పెడితే మొదటి రోజే చూసిన ఎందరో ప్రేక్షకులకు అది నచ్చలేదన్నది వాస్తవం. పబ్లిక్ టాక్స్ లోనూ బయట పడింది. ఎన్నో అంచనాలు పెట్టుకుంటే ఇలా నిరాశ పరుస్తారనుకోలేదని వందల రూపాయలు టికెట్లు కొన్న వాళ్ళు ఓపెన్ గానే చెప్పారు. కొన్ని బాలీవుడ్ హ్యాండిల్స్ ఓవరాక్షన్ చేసిన మాట నిజమే కానీ కంటెంట్ తేడా కొట్టడాన్ని ఎవరూ కాదనలేం.
బుక్ మై షో ట్రెండ్స్ చూసినా, రోజురోజుకు పడిపోతున్న వసూళ్ల గ్రాఫ్ గమనించినా బాక్సాఫీస్ తత్వం బోధ పడుతుంది. ఇప్పుడు టాక్సిక్ బాలేదని చెబుతున్న వాళ్ళే కెజిఎఫ్ రెండు భాగాలకు వందల కోట్లు కురిపించారు. టాక్సిక్ యష్ కు ఒకటే వచ్చింది కాదు. అమితాబ్ బచ్చన్ నుంచి రజనీకాంత్ వరకు, చిరంజీవి నుంచి కన్నడ రాజ్ కుమార్ వరకు అందరూ ఫ్లాపులు చూసినవాళ్ళే. పొరపాటు సరిదిద్దుకున్నవాళ్ళే. యష్ తక్షణ కర్తవ్యం ఇదే. అంతే తప్ప పరనింద ఆత్మస్తుతి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
