ఆమిర్‌ ఖాన్‌… అవసరం లేని సినిమా

ఒకప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎవ్వరూ అందుకోలేని స్థాయిని అందుకున్నాడు ఆమిర్ ఖాన్. లగాన్, రంగ్ దే బసంతి, 3 ఇడియట్స్, పీకే, దంగల్.. ఈ చిత్రాలు ఎలాంటి సంచలనం రేపాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయా సమయాలకు ఇవి ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. ‘దంగల్’ సినిమాతో చైనాలోనూ భారీగా వసూళ్లు కొల్లగొట్టి ఎవ్వరూ అందుకోలేని ఇండస్ట్రీ హిట్టుగా నిలబెట్టాడు ఆమిర్. కానీ ఆ తర్వాత మాత్రం ఆయనకు కలిసి రాలేదు.

థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, లాల్ సింగ్ చడ్డా ఘోరాతి ఘోరమైన ఫలితాలను అందుకుని ఆయన్ని కిందికి లాగేశాయి. గత ఏడాది ‘సితారే జమీన్ పర్’తో ఓ మోస్తరు ఫలితాన్ని అందుకున్నప్పటికీ.. అది ఆయన స్థాయికి తక్కువే. ఐతే ‘లగాన్’ దర్శకుడు అశుతోష్ గోవారికర్‌తో ఆమిర్ జట్టు కట్టబోతున్నట్లు వార్తలు రావడంతో ఆ హీరో అభిమానులు ఎగ్జైట్ అయ్యారు. ఇది ఆమిర్‌కు సరైన కమ్ బ్యాక్ మూవీ అవుతుందనుకున్నారు.

కానీ ఆ సినిమా సంగతేమైందో కానీ.. ఇప్పుడు ఆమిర్ హీరోగా కొత్త సినిమా తెరపైకి వచ్చింది. ఆయనతో ‘రేస్-4’ తీయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. నిర్మాత రమేష్ తరౌని.. ఆమిర్ దగ్గరకు ఈ స్క్రిప్టు తీసుకెళ్తే ఆయన సినిమా చేయడానికి ఓకే అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఐతే ‘రేస్’ ఫ్రాంఛైజీలో అబ్బాస్-మస్తాన్ డైరెక్ట్ చేసిన తొలి సినిమా మాత్రమే ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. పార్ట్-1లో హీరోగా చేసిన సైఫ్ అలీఖానే లీడ్ రోల్ చేసిన ‘రేస్-2’ అంచనాలను అందుకోలేకపోయింది. దీన్ని అబ్బాస్-మస్తాన్‌లే డైరెక్ట్ చేశారు.

ఐతే తర్వాత సల్మాన్ హీరోగా రెమో డిసౌజా దర్శకత్వంలో ‘రేస్-3’ తీస్తే అది డిజాస్టర్ అయింది. సోషల్ మీడియాలో ట్రోల్స్ మామూలుగా రాలేదు. దీంతో రేస్ ఫ్రాంఛైౌజీ ఆగినట్లే అనుకున్నారు. కానీ ఇప్పుడు రేస్-4 అంటున్నారు. పైగా ఈ చిత్రానికి ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ తీసిన విజయ్ కృష్ణ ఆచార్య దర్శకుడట. దీంతో ఆమిర్ అభిమానులే ఈ సినిమా పట్ల వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు. ఆమిర్‌కు ఇది అవసరం లేని సినిమా అని.. ఆయన చక్కగా అశుతోష్‌తో సినిమా చేసుకోవడg బెటర్ అని అంటున్నారు అభిమానులు.