సెప్టెంబర్ బోణీ వారం… పోటీ రసవత్తరం

ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్ సన్స్ మంచి వసూళ్లు రాబట్టినప్పటికీ రవితేజ డామినేషన్ ముందు మిగిలినవి తర్వాతి స్థానాలు తీసుకోక తప్పలేదు. ఎనిమిదో రోజు కూడా సాలిడ్ ఆక్యుపెన్సీలతో ఈ మూవీ దూసుకుపోతున్న వైనం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా సంక్రాంతి సీజన్ లో కూడా చూడలేని కొన్ని అరుదైన ఫీట్లు బిసి సెంటర్లలో నమోదు చేయడం ఊహలకు అందనిది.

ఇక సెప్టెంబర్ మొదటి వారం రాబోతోంది. బోణీ ఎవరు చేస్తారనే దాని మీద రకరకాల క్యాలికులేషన్లు ఉన్నాయి. ముందుగా మూడో తేదీ సంగతి చూస్తే సుమంత్ ప్రభాస్ ‘రోమాంచకం’ మెల్లగా సౌండ్ పెంచే పనిలో ఉంది. సందీప్ రెడ్డి వంగ ప్రొడక్షన్ కావడంతో మూవీ లవర్స్ దీని మీద ఆసక్తి చూపిస్తున్నారు. అదే రోజు దుల్కర్ సల్మాన్ ‘ఐఎమ్ గేమ్’ అన్నపూర్ణ సంస్థ ద్వారా ఏపీ తెలంగాణలో రిలీజ్ కానుంది. డబ్బింగ్ అయినప్పటికీ కంటెంట్ పట్ల మేకర్స్ ధీమాగా ఉన్నారు.

ఇక నాలుగో తేదీ విషయానికి వస్తే మలయాళంలో రెండో వారానికే వంద కోట్లు లాగేసిన ‘బెత్లెహమ్ కుటుంబ యూనిట్’ కొంచెం ఆలస్యంగా అయినా అనువాదం రూపంలో వస్తోంది. మైత్రి పంపిణీ బాధ్యతలు తీసుకుంది. హీరో కన్నా ఎక్కువగా మమిత బైజు బ్రాండ్ పని చేస్తే ఓపెనింగ్స్ వచ్చినట్టే. అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’కి మాగ్జిమం ప్రమోషన్లు చేస్తున్నారు. కంబ్యాక్ సీజన్ గా మారిపోయిన ఈ టైంలో అల్లరోడికి హిట్టు దక్కుతుందనే ఆశాభావం అభిమానుల్లో కనిపిస్తోంది.

యాభై కోట్లు తెస్తామని హీరో, ఆడకపోతే గుండు గీసుకుంటానని హీరోయిన్ శపధాలు చేసిన ‘సహ’ పూర్తిగా యూత్ ని నమ్ముకుని దిగుతోంది. బన్నీ వాస్ అండగా ఉండటం థియేటర్ల పరంగా ప్లస్ కానుంది. ఇవి కాకుండా బాలీవుడ్ ‘మీర్జాపూర్’ తెలుగు డబ్బింగ్ తో మనోళ్ళను పలకరించనుంది. బోనస్ గా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటి సినిమా ‘నువ్వే నువ్వే’ కూడా రీ రీ రిలీజ్ అవుతోంది. ఇరుముడి స్ట్రాంగ్ గా ఉన్న టైంలో వీటిలో ఏవి ధీటుగా నిలబడతాయో చూడాలి.