ప్యారడైజ్ నిర్ణయం ఇరుముడికి వరం

ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడే ఎక్కడో చివుక్కుమంటుంది. అన్నీ టైం ప్రకారం పూర్తయ్యి ఉంటే నిన్న ఆగస్ట్ 21 నాని ది ప్యారడైజ్ విడుదలయ్యేది. చాలా నమ్మకంతో ఆ డేట్ ఫిక్స్ చేసుకుని ఎప్పుడో ప్రకటించుకున్నారు. కానీ బోలెడు వర్క్ పెండింగ్ ఉండిపోవడంతో విధి లేని పరిస్థితుల్లో మంచి తేదీని ప్యారడైజ్ వదులుకోవడం ఫ్యాన్స్ మర్చిపోలేదు.

అప్పటిదాకా సరైన స్లాట్ కోసం వెయిటింగ్ లో ఉన్న ఇరుముడి క్షణం ఆలస్యం చేయకుండా, మరో అయిదు రోజుల్లో యష్ టాక్సిక్ వస్తుందని తెలిసినా ధైర్యం చేసి ఆగస్ట్ 21 తీసేసుకుంది. ఇప్పుడదే ఎంత గొప్ప నిర్ణయమో వసూళ్ల రూపంలో కనిపిస్తోంది. బోణీ వరలక్ష్మి వ్రతంతో మొదలయ్యింది. ప్రభుత్వాలు సెలవు ప్రకటించడంతో దాని ప్రభావం నేరుగా థియేటర్ల మీద పడింది. ఏదో ఆదివారం అన్న రేంజ్ లో సినిమా హాళ్లు కుటుంబాలతో, హౌస్ ఫుల్ బోర్డులతో కళకళలడాయి.

ఇవాళ నాలుగో శనివారం. బ్యాంకులు తదితర కార్యాలయాలకు హాలిడే. రేపు ఆదివారం. ఇంకో రెండు రోజులు గ్యాప్ తీసుకుంటే, బుధవారం మిలాద్ నబికి మరో సెలవు వస్తుంది. అంటే కేవలం ఆరు రోజుల వ్యవధిలో నాలుగు రోజులు ఇరుముడిగా పెద్ద ప్లస్ అవుతున్నాయి. పాజిటివ్ టాక్ రావడంతో పాటు అయ్యప్ప స్వామి అంశం జనాన్ని విపరీతంగా ఆకర్షిస్తోంది. కథ నేరుగా దేవుడికి సంబంధించింది కాకపోయినా మల్లెపూలపల్లకి పాట, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఆడియన్స్ ని థియేటర్స్ వైపు లాగుతోంది.

ఓపెనింగ్ నెంబర్లు, వసూళ్ల లెక్కలు ఇవన్నీ మెల్లగా బయటికి వస్తాయి కానీ ప్యారడైజ్ కనక చెప్పిన మాట మీద నిలబడి ఉంటే ఇరుముడి ఇంకో ఆప్షన్ చూసుకోవాల్సి వచ్చేది. ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ ఆగస్ట్ 26 రాబోతున్న టాక్సిక్ ప్రభావం తమ సినిమా మీద ఏ మేరకు ఉంటుందోనని రవితేజ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. దానికి పాజిటివ్ టాక్ వస్తే మాస్ జనాలు ఎక్కువ శాతం అటు మొగ్గు చూపే అవకాశం ఉంది. నాలుగు రోజులు ఆగితే దాని సంగతీ తేలిపోతుంది.