గ్యాప్ వచ్చినా గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు

బేబీ లాంటి కల్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత ఆనంద్ దేవరకొండ మళ్ళీ స్పీడ్ పెంచలేదు. 2024 మే నెలలో వచ్చిన గం గం గణేశా ఆ అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. దీంతో గట్టిగానే బ్రేక్ తీసుకున్నాడు. చూస్తుండగానే సిల్వర్ స్క్రీన్ మీద అతన్ని చూసి రెండేళ్లకు పైగా గ్యాప్ వచ్చేసింది. అయితే ఈ లాంగ్ గ్యాప్ కు ఎండ్ కార్డ్ వేస్తూ ఇప్పుడు ఏకంగా మూడు ప్రాజెక్టులతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. 

వరుస సినిమాలతో తన మార్కెట్ ను మళ్లీ స్ట్రాంగ్ చేసుకునే పనిలో పడ్డాడు. ఈ లైనప్ లో ముందుగా థియేటర్లలో సందడి చేయబోయేది ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్. నైంటీస్ వెబ్ సిరీస్ తో అందరినీ ఆకట్టుకున్న ఆదిత్య హాసన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. వైష్ణవి చైతన్య ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. సెప్టెంబర్ 11న ఈ మూవీ రిలీజ్ కాబోతోందని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు.

థియేట్రికల్ రిలీజ్ సంగతి పక్కన పెడితే ఆనంద్ ఖాతాలో తక్షకుడు అనే మరో డిఫరెంట్ ప్రాజెక్ట్ కూడా ఉంది. మిడిల్ క్లాస్ మెలోడీస్ లాంటి డీసెంట్ హిట్ ఇచ్చిన వినోద్ అనంతోజు ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఇదొక ఫోక్ లోర్ థ్రిల్లర్ గా రూపొందింది. నితాన్షి గోయెల్ కీలక పాత్ర చేసిన ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయిపోయింది.

ఈ సినిమాలో ఆనంద్ ఒక అంధుడైన గిరిజన యువకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే ఇది థియేటర్లలో కాకుండా నేరుగా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఒక కొత్త క్యారెక్టరైజేషన్ తో వస్తున్న ఈ సినిమా ఆనంద్ కు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చే అవకాశం ఉంది.

ఈ రెండు ప్రాజెక్టులు ఒక కొలిక్కి రాగానే మరో సినిమాకు కూడా ఆనంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. బలగం సినిమాకు రైటింగ్ విభాగంలో పని చేసిన నాగరాజు ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్నాడు. ధీరజ్ మొగిలినేని నిర్మాణంలో రాబోతున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటోంది.

కెరీర్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఆనంద్ ఎప్పుడూ ఒకే ఫార్మాట్ కు స్టిక్ అవ్వలేదు. ఇప్పుడున్న లైనప్ లో కూడా ఎపిక్ తో ఒక లవ్ స్టోరీని టచ్ చేస్తుంటే తక్షకుడు తో ఫోక్ లోర్ బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నాడు. ఇక రెండేళ్ల బ్రేక్ తర్వాత ఫుల్ బిజీ అయిపోయిన ఆనంద్ ఎలాంటి సక్సెస్ ను అందుకుంటాడో చూడాలి.