గత రెండు మూడు నెలలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ‘పెద్ది’ దగ్గర్నుంచి ప్రతి రెండు వారాలకూ ప్రేక్షకులను అలరించే సినిమా పడుతోంది. థియేటర్లలో మంచి సందడి కనిపిస్తోంది. గత వీకెండ్లో రిలీజైన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చాలా బాగా ఆడుతోంది. ఇక వచ్చే వారాంతంలో రాబోతున్న ‘ఇరుముడి’ మీదా మంచి అంచనాలున్నాయి.
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా కాలం అయినప్పటికీ.. ‘ఇరుముడి’ మీద ఆ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. ఈ సినిమా పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల్లో సినిమా మీద అంచనాలు పెంచాయి. టీం కూడా రిజల్ట్ పై చాలా ధీమాగా కనిపిస్తోంది. ఎప్పుడూ తన సినిమాలకు మరీ హైప్ ఇవ్వని రవితేజ కూడా.. ఈ చిత్రం మీకు పిచ్చపిచ్చగా నచ్చేస్తుందంటూ అభిమానులతో అన్నాడు. ఐతే తమ సినిమాల గురించి అందరూ ఇలా ధీమాగానే మాట్లాడతారన్నది తెలిసిందే.
‘ఇరుముడి’ ట్రైలర్ చూస్తే కొంచెం థ్రిల్ జోడించిన డీసెంట్ ఫ్యామిలీ డ్రామాలా కనిపిస్తోంది. ఈ మధ్య ఫ్యామిలీ సినిమాలు తెగ ఆడేస్తున్న సంగతి తెలిసిందే. మా ఇంటి బంగారం, విశ్వనాథ్ అండ్ సన్స్ కలెక్షన్లు చూశాక ‘ఇరుముడి’ కూడా ఆ జాబితాలో చేరొచ్చనే అంచనాలు కలుగుతున్నాయి. ఐతే ఇవన్నీ ఒకెత్తయితే.. ఈ సినిమాలో ఉన్న ‘భక్తి’ యాంగిల్ సినిమాకు వరంగా మారినా ఆశ్చర్యం లేదు.
తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప స్వామి భక్తులు ఎంత పెద్ద సంఖ్యలో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సరిగ్గా అయ్యప్ప స్వామి సీజన్ మొదలైన సమయంలోనే ఈ సినిమా రిలీజవుతోంది. ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప స్వాముల సందడి మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది చెడు అలవాట్లను మానుకోవడానికి అయ్యప్ప మాల వేస్తుంటారన్నది తెలిసిన సంగతే. ఈ సినిమాలో హీరోకు కూడా తాగుడు అలవాటుంటుంది. దాన్నుంచి దృష్టి మళ్లించుకోవడానికే అతను అయ్యప్ప మాల వేస్తాడు. ఈ పాయింట్‌తో ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారనడంలో సందేహం లేదు.
ఇక సినిమాలో ఉన్న రెండు అయ్యప్ప పాటలు ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా మల్లెపూల పల్లకి పాట థియేటర్లను ఒక ఊపు ఊపేస్తుందనే చర్చ జరుగుతోంది. కాబట్టి సినిమా బాగుందనే టాక్ వస్తే,. అయ్యప్ప మాలకు సంబంధించిన సన్నివేశాలు, పాటల గురించి రిలీజ్ తర్వాత ప్రేక్షకులు ఎక్కువ మాట్లాడుకుంటే.. అయ్యప్పస్వామి భక్తులు థియేటర్లకు వరుస కట్టడం ఖాయం. సినిమాకు మంచి టాక్ రావడంతో పాటు, అయ్యప్ప భక్తులు కనెక్ట్ అయ్యేలా ఉంటే మాత్రం ‘ఇరుముడి’ ఊహించని రేంజికి వెళ్లిపోవచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates