టాలీవుడ్లో రచయితగా, దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ స్థాయి ఏంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత గౌరవం పొందుతున్న దర్శకుల్లో ఆయనొకరు. ఆయన రచనా పటిమ, దర్శకత్వ ప్రతిభకు తోడు.. భాష, సాహిత్యం మీద ఉన్న పట్టుకు, విద్వత్తుకు ఎంతోమంది శిరస్సు వంచి నమస్కరిస్తారు. అలాంటి దర్శకుడు స్టేజ్ మీద ఓ నిర్మాతకు పాదాభివందనం చేయడం.. ఆయన గురించి ఎంతో ఉద్వేగంతో గొప్పగా మాట్లాడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ వ్యక్తి మరెవరో కాదు.. ‘స్రవంతి’ రవికిషోర్. రచయితగా త్రివిక్రమ్‌కు లైఫ్ ఇచ్చిన ‘నువ్వే కావాలి’.. దర్శకుడిగా అతడికి ఆరంభాన్నిచ్చిన ‘నువ్వే నువ్వే’ చిత్రాలను నిర్మించింది రవికిషోరే. ఆయన నిర్మాణంలో తెరకెక్కిన కొత్త చిత్రం ‘రెడ్’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన త్రివిక్రమ్.. తన నిర్మాత గురించి ఎంతో గొప్పగా మాట్లాడాడు.
తాను రచయితగా పని చేసిన ‘స్వయంవరం’ హిట్టయినప్పటికీ తర్వాత తనకు పెద్దగా అవకాశాలు రాలేదని.. దీంతో భీమవరం వెళ్లిపోయి అక్కడ క్రికెట్ ఆడుకుంటూ ఉన్నానని.. అలాంటి సమయంలో రవికిషోర్ పట్టుబట్టి తనను మళ్లీ హైదరాబాద్‌కు రప్పించి ‘నువ్వే కావాలి’ సినిమాకు రచయితగా పని చేయించాడని త్రివిక్రమ్ వెల్లడించాడు. ఆ తర్వాత తాను రాసిన ‘నువ్వు నాకు నచ్చావ్’ స్క్రిప్టు ఫైల్ పట్టుకుని వెళ్లి చదివి అర్ధరాత్రి దాటాక ఫలానా డైలాగ్ ఎంత బాగుందో అని చదివి వినిపిస్తుంటే తన మనసు పులకించిందని త్రివిక్రమ్ గుర్తు చేసుకున్నాడు. అంతటి సంస్థలో నాలుగు సినిమాలు రాసే అదృష్టం తనకు దక్కిందని త్రివిక్రమ్ అన్నాడు.
ఇలాంటి వ్యక్తికి ఎక్కువ విజయాలు రావాలని.. అప్పుడు మరిన్ని సినిమాలు తీయాలన్న హుషారు, కోరిక కలుగుతాయని త్రివిక్రమ్ చెప్పాడు. తనకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో స్క్రిప్టు మీద అత్యంత పట్టున్న నిర్మాతల్లో ఒకరు రామానాయుడు అయితే.. ఇంకొకరు రవికిషోర్ అని.. వీళ్లతో పని చేయడం ద్వారా తాను ఎంతో నేర్చుకున్నానని అన్నాడు. ఇంకా రవికిషోర్ సినీ ప్రయాణం, ఆయనతో తన అనుభవాల గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు చెప్పిన త్రివిక్రమ్.. చివర్లో భావోద్వేగానికి గురయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట కూడా తడబడింది. ఇంతలో రవికిషోర్ వచ్చి త్రివిక్రమ్ భుజం మీద చేయి వేసి నిలబడగా.. త్రివిక్రమ్ ఆయనకు పాదాభివందనం కూడా చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.