మల్లెపూల పల్లకి.. ఒరిజినల్ సింగరే కానీ…

‘ఇరుముడి’ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘మల్లెపూల పల్లకి’ పాట వచ్చేసింది. అయ్యప్ప భక్తులకు ఈ పాట కొత్తది కాదు. ఏళ్లుగా సీజన్‌లో వినిపించే పాపులర్ పాట కావడంతో కొత్త వెర్షన్ మీద ముందే మంచి ఆసక్తి ఉంది. రవితేజను అయ్యప్ప మాలలో చూపిస్తూ పెద్ద సెటప్‌లో పాటను తీశారు. విజువల్స్ విషయంలో పెద్దగా కంప్లైంట్స్ లేకపోయినా, పాట వినిపించిన విధానం మీద మాత్రం సోషల్ మీడియాలో రెండు రకాల టాక్స్ వస్తున్నాయి.

కామెంట్స్ చూస్తే చాలామంది వెంటనే పాత వెర్షన్‌తో పోల్చేస్తున్నారు. ఒరిజినల్ అలాగే పెట్టాల్సింది, వాయిస్ సెట్ కాలేదు.. అంటూ కొందరు స్పందిస్తున్నారు. ఇంకొందరు మాత్రం ఇదే పాటను థియేటర్‌లో చూస్తే ఎఫెక్ట్ వేరుగా ఉంటుందని అంటున్నారు. పాత పాటతో ఎన్నో ఏళ్లుగా కనెక్ట్ అయిన వాళ్లకు కొత్త మ్యూజిక్ అరేంజ్‌మెంట్ వెంటనే ఎక్కకపోవడం కూడా పెద్ద ఆశ్చర్యం కాదు.

అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. కొత్త వెర్షన్‌ను పాడింది వేరే సింగర్ కాదు. ఒరిజినల్ పాటను పాపులర్ చేసిన డప్పు శ్రీనునే ‘ఇరుముడి’ కోసం మళ్లీ పాడారు. జీవీ ప్రకాశ్ మాత్రం మ్యూజిక్‌ను కొత్తగా రీక్రియేట్ చేశాడు. ఇక ఆడియన్స్ చెబుతున్న వాయిస్ తేడాను పూర్తిగా కొట్టిపారేయలేం. ఏళ్ల క్రితం విన్న పాటలోని ఎనర్జీ, ఇప్పుడు రికార్డ్ చేసిన వర్షన్‌లో అలాగే అనిపించకపోవచ్చు. పైగా మధ్యలో ఎన్నో డీజే వెర్షన్లు ఈ పాటను మరింత హై ఎనర్జీగా జనాల్లోకి తీసుకెళ్లాయి. అందుకే కొత్తది నేరుగా వాటితోనే కంపేర్ అవుతోంది.

టీమ్‌కు మాత్రం ఇంకో ఛాన్స్ ఉంది. థియేటర్ల కోసం ప్రత్యేక డీజే వెర్షన్ ఉంటుందని జీవీ ప్రకాశ్ ఈవెంట్‌లో చెప్పాడు. అది సినిమాలో ఎక్కడ వస్తుంది, రవితేజ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఎంత వరకు వర్కౌట్ అవుతుంది అన్నదే అసలు విషయం. ఇప్పుడున్న లిరికల్ లేదా వీడియో వెర్షన్‌తోనే మొత్తం పాట ఎఫెక్ట్‌ను ఫిక్స్ చేయడం తొందరపాటే అవుతుంది.

‘ఇరుముడి’ ఆగస్టు 21న వస్తోంది. రిలీజ్‌కు ముందు పాపులర్ అయ్యప్ప పాటను తీసుకోవడం టీమ్‌కు మంచి అడ్వాంటేజ్. అదే సమయంలో ఒరిజినల్‌తో ఉన్న జ్ఞాపకాలే కొత్త వెర్షన్‌కు పెద్ద పరీక్షగా మారాయి. ప్రస్తుతం టాక్ మిక్స్‌డ్‌గా ఉన్నా, థియేటర్‌లో డీజే వెర్షన్ క్లిక్ అయితే ఈ చర్చ అక్కడితో మారిపోవచ్చు.