కేవలం తెలుగువారి కోసమే ఒక ఓటీటీ ఉండాలన్న భిన్నమైన ఆలోచన చేసి.. ‘ఆహా’ పేరుతో కొత్త ఓటీటీ పెట్టి దాన్ని సూపర్ సక్సెస్ చేసిన ఘనత అల్లు అరవింద్‌దే. కరోనా ఈ ఓటీటీకి బాగానే కలిసొచ్చింది. లాక్ డౌన్ టైంలో జనాలు దీన్ని బాగా ఆదరించారు. ఐతే అదే సమయంలో ఓటీటీల హవా చూసి.. సినిమాలు, థియేటర్ల పరిస్థితి ఏమవుతుందో అన్న చర్చ నడిచింది. జనాలు వెబ్ సిరీస్‌లకు, ఇంటర్నేషనల్ కంటెంట్‌కు బాగా అలవాటు పడిపోయిన నేపథ్యంలో లోకల్ సినిమాల పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. ఐతే సినిమాకు ఇప్పుడొచ్చిన ఢోకా ఏమీ లేదని తేల్చేశారు ‘ఆహా’ అధిపతి అల్లు అరవింద్.
‘అల వైకుంఠపురములో’ రీయూనియన్ వేడుకలో ఈ విషయమై ఆయనొక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ‘‘లాక్ డౌన్ టైంలో అందరూ ఓటీటీలకు అలవాటు పడిపోయి.. సినిమా చచ్చిపోతుందని శాడిస్టిగ్గా మాట్లాడారు. కానీ ఆహా ఓటీటీ ఓనర్‌గా చెబుతున్నా. అన్నింటికంటే సినిమానే గొప్పది. సినిమా అనేది తల్లి లాంటిది. ఓటీటీలు దాని పిల్లలు. కాబట్టి ఏది వచ్చినా సినిమా తట్టుకుని నిలబడుతుంది. సినిమాను మించింది ఏదీ లేదు’’ అని అరవింద్ ధీమా వ్యక్తం చేశారు.
ఇక ‘అల వైకుంఠపురములో’ సినిమాను ఒక వజ్రంగా పేర్కొన్న అరవింద్.. ఈ సినిమా త్రివిక్రమ్ మాయ అని చెప్పాడు. కరోనా టైంలో జనాలు ఈ సినిమా చూసి ఎంతో ఉపశమనం పొందారని.. థియేటర్లలో అద్భుత విజయం సాధించాక నెట్ ఫ్లిక్స్, సన్ నెక్స్ట్ వాళ్లు ఈ చిత్రాన్ని మరింతగా ప్రమోట్ చేసి తమ ఓటీటీల ద్వారా జనాల్లోకి మరింతగా తీసుకెళ్లారని.. మామూలుగా ఓటీటీల్లో ఒక సినిమాను చూసే స్థాయి కంటే నాలుగైదు రెట్లు ఎక్కువగా ఈ చిత్రాన్ని జనాలు చూశారని అరవింద్ అన్నారు.
మరోవైపు పూజా హెగ్డే గురించి మాట్లాడుతూ.. ఆమెకు బాలీవుడ్లో మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయని విన్నానని.. ఆమె తెలుగు వాళ్లను మరిచిపోవద్దని అరవింద్ అన్నారు. ఈ సందర్భంగా ఇక్కడే ఒక తెలుగబ్బాయిని చేసుకుంటే ఆమె ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉంటుందని నమ్ముతానని ఆయన చమత్కరించడం విశేషం.