సిమ్ర‌న్… చిత‌గ్గొట్టేసిందిగా

ఈ త‌రం ప్రేక్ష‌కుల‌కు సిమ్ర‌న్ బ‌గ్గా గురించి పెద్ద‌గా తెలియ‌క‌పోవ‌చ్చు కానీ.. 2000 సంవత్స‌రానికి అటు, ఇటు తెలుగు, త‌మిళ చిత్రాలు చూసిన వారికి ఆమె ప్ర‌భావం ఎలాంటిదో బాగా తెలుసు. ఆ టైంలో ఈ రెండు భాష‌ల్లో అంద‌రు అగ్ర క‌థానాయ‌కుల‌తోనూ సినిమాలు చేసింది ఈ ముంబ‌యి భామ‌. క‌థానాయిక‌గా ప‌రిచ‌యం అయింది హిందీలోనే అయినా.. ఆమె సౌత్ సినిమాల్లోనే తిరుగులేని స్థాయిని అందుకుంది. 

త‌న అందంతో ఒక ఊపు ఊపేయ‌డ‌మే కాదు.. డ్యాన్సుల్లోనూ త‌న‌కు తిరుగులేద‌ని చాటింది సిమ్ర‌న్. అన్న‌య్య సినిమాలో ఆట కావాలా పాట కావాలా లాంటి పాట‌లు చూస్తే సిమ్ర‌న్ డ్యాన్సింగ్ టాలెంట్ ఎలాంటిదో అర్థ‌మ‌వుతుంది. ల‌య‌బ‌ద్ధంగా న‌డుమును ఊపుతో ఆమె వేసే స్టెప్పుల‌కు అప్ప‌టి యువత ఊగిపోయేవారు.

ఐతే ఇప్పుడు సిమ్ర‌న్ 50ల్లోకి వ‌చ్చేసింది. వ‌య‌సుకు త‌గ్గ‌ట్లే బ‌య‌ట తెల్ల జుత్తుతో క‌నిపిస్తోందామె. అయినా స‌రే.. ఆమెలో ఉత్సాహం ఏమీ త‌గ్గ‌లేదు. తాజాగా జీ త‌మిళ్ ఛానెల్లో వ‌చ్చే డ్యాన్స్ షోలో భాగంగా సిమ్ర‌న్ త‌న నృత్య క‌ళ‌ను బ‌య‌ట‌పెట్టింది. ధ‌నుష్ సినిమా మారిలోని ఒక ఫాస్ట్ బీట్ సాంగ్‌కు స్టేజ్ మీద సిమ్ర‌న్ వేసిన స్టెప్పుల‌కు అంద‌రూ అవాక్క‌యిపోయారు. చీర‌క‌ట్టులో అదిరిపోయే ఎక్స్‌ప్రెష‌న్స్ ఇస్తూ.. వ‌య‌సు ఒక నంబ‌ర్ మాత్ర‌మే అనిపించేలా స్టెప్పుల‌తో అల‌రించింది 

ఈ స్టేజ్ మీద ఉన్న ఒక‌ప్ప‌టి సిమ్ర‌న్ కోస్టార్, సీనియ‌ర్ న‌టుడు ప్ర‌శాంత్ కూడా ఆమె స్టెప్పులు చూసి ఆశ్చ‌ర్య‌పోయాడు. పెళ్లి త‌ర్వాత కొన్నేళ్లు గ్యాప్ తీసుకున్న సిమ్ర‌న్ మ‌ళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి వ‌య‌సుకు త‌గ్గ పాత్ర‌ల్లో న‌టిస్తోంది. సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ హీరోగా అశ్వ‌త్ మారిముత్తు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ధ‌ర్మ‌న్ చిత్రంలో ఆమె న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.