చాలా కాలంగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నప్పటికీ.. మాస్ రాజా రవితేజకు అవకాశాల విషయంలో లోటేమీ లేదు. ఇంతకుముందులా మాస్ చిత్రాలకు పరిమితం కాకుండా భిన్నమైన సినిమాలు చేసేందుకు రెడీ కావడం, అదే సమయంలో పారితోషకం కూడా తగ్గించుకోవడంతో మాస్ రాజాతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. ఈ నెలలోనే ఇరుముడి చిత్రంతో పలకరించబోతున్న రవితేజ.. హాసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణుతో కలిసి వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
మరోవైపు విలక్షణ దర్శకుడు వివేక్ ఆత్రేయత ఓ సినిమా చేయడానికి కూడా రవితేజ పచ్చ జెండా ఊపాడు. ఇరుముడి చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసిన మైత్రీ మూవీ మేకర్సే ఈ మూవీని కూడా నిర్మించాల్సింది. కానీ ఏమైందో ఏమో.. ఇప్పుడు ఆ అగ్ర నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుందట. ఈ సినిమా వేరే నిర్మాత చేతుల్లోకి వెళ్లినట్లు సమాచారం. ఒకప్పుడు దిల్ రాజు సంస్థలో వచ్చిన అనేక చిత్రాలకు శిరీష్‌తో కలిసి సహ నిర్మాతగా వ్యవహరించిన లక్ష్మణ్ గుర్తున్నాడా? కారణాలేంటో కానీ.. తర్వాత ఆయన ఆ సంస్థకు దూరం అయ్యాడు.
డిస్ట్రిబ్యూషన్లో ఉన్నప్పటికీ.. లక్ష్మణ్ ఇండస్ట్రీలో పెద్దగా కనిపించింది లేదు. ఆయన ఇప్పుడు నిర్మాతగా మారుతున్నాడట. మైత్రీ సంస్థ వదిలేసిన రవితేజ, వివేక్ ఆత్రేయ సినిమాను లక్ష్మణే ప్రొడ్యూస్ చేయనున్నాడట. ఇది కాస్త ఎక్కువ బడ్జెట్లోనే తెరకెక్కే సినిమా అంటున్నారు. ఇలాంటి ప్రాజెక్టును లక్ష్మణ్ టేకప్ చేయడం ఆశ్చర్యమే. అయితే దీనిపై అధికారిక ప్రకటన వస్తె కానీ సరైన స్పష్టత రాదు. త్వరలోనే ఈ మూవీ గురించి అనౌన్స్‌మెంట్ రాబోతోంది. ఇరుముడి ఈ నెల 21న రిలీజ్ కానుండగా.. రవితేజ, శ్రీ విష్ణు మూవీని కుదిరితే సంక్రాంతికి, లేదంటే వేసవికి రిలీజ్ చేయనున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates