గత రెండు నెలలుగా థియేటర్లు కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా వీకెండ్ వస్తే చాలు హౌస్ ఫుల్ బోర్డులు పడిపోతున్నాయి. యునానిమస్ కాదు జస్ట్ పర్వాలేదనే టాక్ వచ్చినా చాలు జనాలు టికెట్లు కొనేసుకుని వెళ్లిపోతున్నారు. ఎందుకంటే ఏపీ తెలంగాణలో టికెట్ రేట్ల పంచాయితీ లేకుండా ఎనిమిది వారాలకు పైగానే బాక్సాఫీస్ ప్రశాంతంగా ఉండటం వల్ల. చివరిగా ధరలు హైక్ తెచ్చుకున్న పెద్ద సినిమా రామ్ చరణ్ పెద్ది ఒక్కటే. ఆ తర్వాత ఏవీ దాని జోలికి వెళ్ళలేదు.
ప్రేక్షకులు కోరుకుంటున్నది ఇదే. ప్రస్తుతం అమలులో ఉన్న రేట్లు అలాగే ఉంచితే చాలని కోరుతున్నారు. కలెక్షన్ల ట్రెండ్ గమనిస్తే ఇది స్పష్టమవుతుంది. కొరియన్ కనకరాజు, చెన్నై లవ్ స్టోరీ, లెనిన్, మా ఇంటి బంగారం లాంటి సూపర్ హిట్స్ తో పాటు నాగబంధం లాంటి ఫ్లాపులు సైతం అంతో ఇంతో డబ్బులు చేశాయంటే దానికి ప్రధాన కారణం రేట్లు తప్ప మరొకటి కాదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఇది సానుకూలంగా పని చేస్తోంది. అక్కడ మల్టీప్లెక్స్ గరిష్ట ధర 177 రూపాయలు మాత్రమే.
వీటికే కాదు స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే, ది ఒడిస్సి లాంటి హాలీవుడ్ మూవీస్ సైతం తెలుగు రాష్ట్రాల్లో బాగా డబ్బులు చేసుకున్నాయి. డబ్బింగ్ బాగుండటంతో పాటు ఎలాంటి పెంపులు లేకపోవడం బయ్యర్లకు మేలు చేసింది. ప్యాన్ ఇండియా నిర్మాతలు మినహాయిస్తే మిగిలిన వాళ్ళు ఈ అంశం మీద సీరియస్ గా దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఆ మధ్య అనగనగా ఒక రాజుకు సైతం సంక్రాంతి పేరు చెప్పి ఏపీలో యాభై రూపాయల హైక్ తీసుకున్న ఉదంతాలు జనవరిలో జరిగాయి.
టికెట్ రేట్లు అందుబాటులో ఉండటం వల్ల ఒక సినిమా స్థానంలో ప్రేక్షకుడు రెండు మూడు సినిమాలు చూస్తాడు. దాని వల్ల ఇతర ప్రొడ్యూసర్లు లాభ పడతారు. యావరేజ్ ఉన్నా చాలు బ్రేక్ ఈవెన్ దాటేసుకోవచ్చని కళ్ళముందు కనిపిస్తోంది. రాబోయే విశ్వనాథ్ అండ్ సన్స్, మకుటం, అగద, పళ్ళబురుసు లాంటి వాటికీ ఈ స్ట్రాటజీ బాగా పని చేస్తుంది. టాక్సిక్ లేదా ప్యారడైజ్ వరకు టికెట్ ధరల గోల ఉండకపోవచ్చు. అప్పటి సిచువేషన్ ఆయా సినిమాల టాక్స్ మీద ఆధారపడి ఉంటుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates