టాలీవుడ్లో చాలా ఏళ్ల నుంచి టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్నాడు తమన్. తెలుగులో దాదాపుగా అందరు టాప్ స్టార్లతో అతను సినిమాలు చేశాడు. ఓవైపు భారీ చిత్రాలకు పని చేస్తూనే ఇంకోవైపు మిడ్ రేంజ్ చిత్రాల్లోనూ భాగమవుతుంటాడతను. ఐతే ఎంత పెద్ద రేంజిలో ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడూ తమన్ ట్రోలింగ్ ఎదుర్కొంటూనే ఉంటాడు. తనపై ఉన్న కాపీ ముద్రను అతను తొలగించుకోలేకపోతున్నాడు.
వేరే మ్యూజిక్‌ను కాపీ కొడతాడనే కాదు.. తన ట్యూన్లను తనే రిపీట్ చేస్తుంటాడనే విమర్శ కూడా అతడిపై ఉంది. తమన్ కంపోజ్ చేసిన ఒకే రకమైన పాటలను పక్క పక్కన పెట్టి అతణ్ని ట్రోల్ చేస్తుంటారు నెటిజన్లు. ఐతే తమన్ ఇవేవీ పట్టించుకోకుండా ముందుకు సాగిపోతుంటాడు. ఐతే ఇటీవల ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో తమన్ మీద పేలిన జోక్ ఇప్పుడు నిజం అయిందనే చర్చ జరుగుతుండడం గమనార్హం.
తమన్ సంగీతం అందించిన ‘కొరియన్ కనకరాజు’ చిత్రం ఈ శుక్రవారమే రిలీజైంది. ఈ సినిమా విడుదలకు ముందు ఈ చిత్ర హీరో వరుణ్ తేజ్, తన సోదరి నిహారిక కొణిదెల, కమెడియన్ సత్యలతో కలిసి ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు తమన్. ఆ సందర్భంగా నిహారిక తనపై ఒక జోక్ వేసింది. ‘ఓజీ’ కోసం కంపోజ్ చేసి మిగిలిపోయిన ట్యూన్లనే ‘కొరియన్ కనకరాజు’లో పెట్టేశారట అని అంటే.. తమన్ నవ్వి ఊరుకున్నాడు. ఐతే ఈ సినిమా రిలీజయ్యాక చూస్తే ఆ జోకే నిజం అనిపిస్తోంది.
ఈ సినిమాలో హీరోకు కొరియన్ దయ్యం పట్టి కథ అక్కడికి షిఫ్ట్ అవ్వగానే ఒక రకమైన థీమ్‌లో బీజీఎం సాగుతుంది. ఆ థీమ్స్ అన్నీ కూడా ‘ఓజీ’కి చాలా దగ్గరగా ఉన్నాయి. దయ్యం ఆవహించి కొరియన్ డాన్ అవతారంలో వరుణ్ తేజ్ స్టైల్‌గా నడిచి వచ్చేటపుడు, కత్తి పట్టుకుని విధ్వంసం సృష్టించేటపుడు వినిపించే సౌండ్స్.. యాజిటీజ్ ‘ఓజీ’ స్కోర్ లాగే అనిపించాయి. సోషల్ మీడియాలో దీని గురించి బోలెడన్ని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇంటర్వ్యూలో వినిపించిన జోక్‌ను తమన్ నిజం చేసేశాడంటూ తనను మరోసారి ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
Gulte Telugu Telugu Political and Movie News Updates