రామాయణ చేయబోతున్న రెండు రోజుల తప్పు

ఇండియా మోస్ట్ కాస్ట్లీ మూవీగా ప్రచారం జరుపుకుంటున్న రామాయణ విడుదల తేదీ విషయంలో కొత్త ట్విస్టు బయట పడింది. ఓవర్సీస్ లో నవంబర్ 6, తర్వాత రెండు రోజులు ఆలస్యంగా ఇండియాలో నవంబర్ 8 రిలీజ్ చేస్తామని నిర్మాత నమిత్ మల్హోత్రా పేర్కొనడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏవో కాసిన్ని గంటల గ్యాప్ అంటే ఏమో అనుకోవచ్చు కానీ ఇలా ఇంతేసి నిడివిని మధ్యలో వదిలేయడం చాలా చేటు చేస్తుందని బయ్యర్ వర్గాలు భావిస్తున్నాయి.

దీనికి నమిత్ మల్హోత్రా  చెబుతున్న కారణాలు డిస్ట్రిబ్యూషన్ సమస్య ప్లస్ దీపావళి పండగ. సమస్య ఏమిటంటే ఇలా నవంబర్ 6 యుఎస్ తదితర దేశాల్లో ముందే ప్రీమియర్ చేయడం వల్ల సోషల్ మీడియాలో వీడియో క్లిప్స్, ఆన్ లైన్ పైరసీ ముందే వచ్చేస్తాయి. ఎంత కంట్రోల్ చేయాలనుకున్నా వీటిని నియంత్రించడం సులభం కాదు. ముంబైలో కట్టుదిట్టంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో ట్రైలర్ లీక్స్ ని అడ్డుకోలేకపోయిన రామాయణ టీమ్ అప్పుడేం చేస్తుందో చెప్పాలా.

ఇది మాత్రం సేఫ్ గేమ్ కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. బహుశా నవంబర్ 6 గాడ్జిల్లా మైనస్ జీరో పెద్ద ఎత్తున రిలీజవుతున్న కారణంగా స్క్రీన్ షేరింగ్ సమస్య తలెత్తకుండా అదే రోజు రామాయణని దించుతున్నారనే కామెంట్ ని కాదనలేం. అలాంటప్పుడు అదేదో మన దేశంలో కూడా ఆరో తేదీనే వదిలితే సరిపోతుంది. పండగ టైంకి టాక్ పుంజుకుని ఫుట్ ఫాల్స్ భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. దీని వెనుక ప్రాక్టికల్ బిజినెస్ కోణాన్ని నమిత్ సరిగ్గా అంచనా వేయలేదేమో అనిపిస్తుంది.

ఇంకో రెండున్నర నెలల్లో విడుదల కాబోతున్న రామాయణ మీద పెట్టుబడుల వరద పారుతోంది. సోని పిక్చర్స్ పంపిణి బాధ్యతలు తీసుకోవడంతో వరల్డ్ వైడ్ పెద్ద ఎత్తున ప్రమోషన్లు చేస్తున్నారు. ట్రైలర్ మీద మంచి స్పందనే వచ్చింది కానీ కాసిన్ని నెగటివ్ కామెంట్స్ వినిపించిన సంగతి తెలిసిందే. టీమ్ మాత్రం అసలు కంటెంట్ స్క్రీన్ మీద గొప్ప అనుభూతి ఇస్తుందని, మునుపెన్నడూ చూడని స్థాయిలో రామాయణని తరతరాలు గుర్తుంచుకునేలా ఉంటుందని ఊరిస్తున్నారు.