వచ్చే వారం ఆగస్ట్ 14 విడుదల కాబోతున్న విశ్వనాథం అండ్ సన్స్ మీద ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి బజ్ ఉంది. ముఖ్యంగా కరుప్పు / వీరభద్రుడు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సూర్య చేసిన సినిమా కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. నిర్మాత నాగవంశీ, దర్శకుడు వెంకీ అట్లూరి తెలుగు వారే అయినా దీన్ని తమిళంలో తీసి మనకు డబ్బింగ్ రూపంలో అందించబోతున్నారు. చెన్నైలో ఇటీవలే చేసిన గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆడియన్స్ దృష్టిని తనవైపు తిప్పుకునేలా చేసింది.
కాంపిటీషన్ లేకుండా మంచి డేట్ సెట్ చేసుకున్న విశ్వనాథంకు బాక్సాఫీస్ వద్ద విశాల్ రూపంలో సవాల్ ఎదురు కానుంది. తన స్వీయ దర్శకత్వంలో రూపొందిన మకుటం అదే ఆగస్ట్ 14 రిలీజవుతోంది. వివిధ షేడ్స్ లో విశాల్ చేసిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా ఇటీవలే కాలం చేసిన నిర్మాత ఆర్బి చౌదరి ఓకే చేసిన చివరి ప్రాజెక్టు. అందుకే కంటెంట్ మీద గట్టి నమ్మకం వ్యక్తమవుతోంది. బడ్జెట్ కూడా భారీగానే ఖర్చు పెట్టారు. అంజలి, తుషర విజయన్ హీరోయిన్లుగా నటించారు.
మరో ట్విస్టు ఏంటంటే విశ్వనాథం అండ్ సన్స్, మకుటం రెండు సినిమాలకు జీవి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు. మ్యూజికల్ గా రెండూ ఒకే త్రాసులో ఉన్నా సూర్యకే కాస్త ఎక్కువ అడ్వాంటేజ్ దక్కుతున్న వైనం సోషల్ మీడియా రెస్పాన్స్ లో గమనించవచ్చు. నిజానికి మకుటం గత నెల విడుదల చేయాల్సింది. అయితే హఠాత్తుగా జన నాయకుడు డేట్ అనౌన్స్ కావడంతో విశాల్ క్లాష్ కావడం ఇష్టం లేక తన సినిమాను వాయిదా వేయించి ఇండిపెండెన్స్ డే ఎంచుకున్నాడు.
మొత్తానికి సూర్య, విశాల్ మధ్య క్లాష్ తమిళంలోనే కాదు తెలుగులో కూడా ఆసక్తికరంగా ఉండే అవకాశాలు కొట్టి పారేయలేం. మకుటం మీద మన దగ్గర పెద్దగా బజ్ లేకపోయినప్పటికీ మాస్ అంశాల వల్ల టాక్ తో నిలబడుతుందనే నమ్మకం విశాల్ లో ఉంది. ఇక క్లాస్ ని ఎక్కువగా టార్గెట్ చేసుకున్న విశ్వనాథ్ అండ్ సన్స్ ఇంకో వారం రోజులు ప్రమోషన్ల మీద దృష్టి సారించనుంది. ఇవి కాకుండా అదే తేదీకి అగాధ, అనకాపల్లి, పల్లబురుసు సినిమాలు కూడా రేసులో ఉన్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates