నగరం రిపీట్ మీద ఆశలు అంచనాలు

ఇవాళ రాత్రి నుంచి ఈ నగరానికి ఏమైంది రిపీట్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. విడుదల రేపు అయినప్పటికీ యూత్ ని ఆకట్టుకునే ఉద్దేశంతో పాటు కంటెంట్ మీద నమ్మకంతో టీమ్ ముందు రోజు చూపించడానికి రెడీ అయిపోయింది. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్టార్ గెస్టులు రానప్పటికీ చిత్ర బృందం చేసిన విన్నపం, చూపించిన కాన్ఫిడెన్స్ ఎంతవరకు నిలబడతాయో ఈ రోజు మిడ్ నైట్ తేలనుంది. దీని మీద ప్రత్యేకంగా పలు అంచనాలు ఆశలు బోలెడున్నాయి.

ముందు దర్శకుడు తరుణ్ భాస్కర్ కి మరోసారి తన టాలెంట్ చూపించుకోవడానికే ఇంతకన్నా వేదిక దొరకదు. నటుడిగా బిజీగా ఉంటూ డైరెక్షన్ ని సీరియస్ గా తీసుకోకపోవడం వల్ల కెరీర్ లో ఇప్పటిదాకా కేవలం మూడు సినిమాలు మాత్రమే చేయగలిగారు. ఇప్పుడీ నగరానికి రిపీట్ కనక సక్సెస్ అయితే మళ్ళీ మెయిన్ లీగ్ లోకి రావొచ్చు. ముఖ్యంగా స్టార్ హీరోల దృష్టిలో పడాలంటే ఇది బ్లాక్ బస్టర్ తక్కువ ఉండకూడదు. కమర్షియల్ జానర్ కాకపోయినా యూత్ ని మెప్పిస్తే చాలు కలెక్షన్ల వర్షమే.

ఇక విశ్వక్ సేన్ ఉన్న బ్యాడ్ ఫేజ్ కి అర్జెంట్ గా ఒక హిట్ కావాలి. కల్ట్ కోసం ఎంత కష్టపడినా లాభం లేకపోయిన నేపథ్యంలో తన ఆశలన్నీ దీని మీదే పెట్టుకున్నాడు. డిసెంబర్ లో రావాల్సిన లెగసిని వాయిదా వేసి ఈ నగరానికి రిపీట్ ప్రమోషన్ల కోసమే పూర్తి సమయం కేటాయించి రోజుల తరబడి పబ్లిసిటీలో భాగమయ్యాడు. నిర్మాత సృజన్ బడ్జెట్ కు వెనుకాడకుండా చాలా ఖర్చు పెట్టారు. ఆకాశంలో ఒక తార, ఓం రూపంలో పోటీ ఉన్నప్పటికీ గెలుస్తామనే నమ్మకంతో ముందడుగు వేశారు.

ఎలాగూ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బోలెడు స్పేస్ ఉంది. ఇట్లు అర్జున, డిఎన్కె అంచనాలు అందుకోలేకపోవడంతో ఖాళీ ఏర్పడింది. రామాయణ, సీన్ రెండో వారంలోనూ నిలబడ్డాయి. ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది రిపీట్ కనక బాగుందనే మాట తెచ్చుకుంటే చాలు ఒక రెండు వారాల దాకా వసూళ్లకు ఢోకా ఉండదు. మొదటి భాగం విడుదలైనప్పుడు కలెక్షన్ల లెక్కల్లో వండర్స్ చేయలేదు. కానీ ఇప్పుడీ రిపీట్ వర్షన్ అంచనాలు అందుకుని డబ్బులు తెస్తుందనే ధీమా మేకర్స్ లో ఉంది.