ఉబర్ డ్రైవర్‌గా నిర్మాత.. నిజమేనా?

నిన్న రాత్రి జరిగిన ‘ఈఎన్ఈ రిపీట్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఆ చిత్ర నిర్మాత సృజన్ యరబోలు హాట్ టాపిక్‌గా మారాడు. అతనెంత ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అన్నది వివరిస్తూ.. దర్శకుడు తరుణ్ భాస్కర్ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పాడు. యుఎస్‌లో ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులను అతను మంచి సినిమాల మీద పెట్టుబడిగా పెడుతున్నాడని.. ఆ క్రమంలోనే ‘35’ లాంటి మంచి సినిమా తీశాడని తరుణ్ చెప్పాడు.

ఇప్పుడు ‘ఈఎన్ఈ రిపీట్’ సినిమా తీశాడని.. ఈ సినిమాకు మధ్యలో డబ్బులు అవసరమైతే అతను యుఎస్‌లో ఉబెర్ నడిపి 20 వేల డాలర్లు సంపాదించి, తమకు పంపించాడని.. ఇంత ప్యాషన్ ఉన్న, కష్టపడే వ్యక్తి సృజన్ అని కొనియాడాడు. తర్వాత అగ్ర నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. తాము ఎప్పట్నుంచో సినిమాలు తీస్తున్నామని, ఎంతోమంది నిర్మాతలుగా కష్టపడుతున్నామని.. కానీ ఒక నిర్మాత ఉబర్ డ్రైవర్‌గా పని చేయడం మాత్రం ఎప్పుడూ చూడలేదని.. అతను చాలా గ్రేట్ అని కొనియాడాడు.

ఐతే ఈ ఈవెంట్లో తర్వాత మాట్లాడిన సృజన్.. తాను ‘ఉబర్’ డ్రైవర్‌గా పని చేయడం మీద క్లారిటీ ఇచ్చాడు. దీన్నొక సింపతీ డ్రామాలాగా చూడొద్దని చెబుతూ.. అతను వివరణ ఇచ్చాడు. ఇండియాలో ఉదయం పని మొదలయ్యే సమయానికి యుఎస్‌లో రాత్రి 9 అవుతుందని.. ఆ టైంలో తాను ఇక్కడ ‘ఈఎన్ఈ రిపీట్’ టీంతో మాట్లాడాల్సి ఉంటుందని.. తన వాయిస్ కొంచెం పెద్దది కావడంతో ఇంట్లో మాట్లాడితే భార్యాపిల్లలు డిస్టర్బ్ అవుతారని, బయటికి వచ్చి కార్లో ప్రయాణిస్తూ టీంతో మాట్లాడేవాడినని సృజన్ తెలిపాడు.

ఐతే ఇలా ఊరికే ఖాళీగా వెళ్లడం ఎందుకు అనిపించి, తర్వాత ఉబర్ క్యాబ్ సర్వీస్ ఇవ్వడం మొదలుపెట్టానని.. ‘ఈఎన్ఈ రిపీట్’కు సంబంధించి ఒక షెడ్యూల్‌కు డబ్బులు అవసరమైతే, ఉబర్‌లో ఒక లాంగ్ ట్రిప్ వేసి ఆ డబ్బులు ఇచ్చానని.. ఇదంతా సరదాగా, ఆసక్తితో చేసిందే తప్ప ఇందులో శాడ్ స్టోరీ ఏమీ లేదని, సింపతీ కోణంలో దీన్ని చూడొద్దని అతను స్పష్టం చేశాడు.