ఇది కదా అభిమానం అంటే

కొందరు ఆర్టిస్టులు తమకు మంచి గుర్తింపు తెచ్చిన సినిమాల పేర్లనే ఇంటి పేరుగా మార్చుకుంటూ ఉంటారు. ‘శుభలేఖ’ సుధాకర్ మొదలుకుని ఇలాంటి ఆర్టిస్టులు చాలామందే కనిపిస్తారు. శ్రీను అనే కమెడియన్‌ ప్రభాస్‌తో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా తన పేరు వెనుక ‘ప్రభాస్’ అని పెట్టేసుకున్నాడు. ఇప్పుడు ఒక చిన్న నటుడు తనకు అవకాశమిచ్చిన దర్శకుడి పేరును తన పేరులోకి చేర్చుకోవడమే కాదు.. తన పిల్లల్ని కూడా ఆ దర్శకుడిలాగే పెంచుకున్నట్లు వెల్లడించాడు.

ఆ నటుడి పేరు.. మహేష్. తరుణ్ తీసిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో అతను యాక్టర్‌గా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత అనేక చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలే చేస్తూ మంచి గుర్తింపు సంపాదించాడు. ఇప్పుడు ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’లోనూ అతను ఓ కీలక పాత్ర చేశాడట. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో మహేష్.. తరుణ్ మీద తనకున్న అభిమానాన్ని బలంగా చాటాడు.

‘‘తరుణ్ సార్ మీరు లేకపోతే నేను లేను. నేను ఈ రోజు ఇన్ని సినిమాలు చేసి ఈ స్టేజ్ మీద మాట్లాడుతున్నా అంటే అందుకు కారణం మీరే. మీరు నాకు అవకాశం ఇవ్వడమే కాదు.. నా జీవితానికి ఒక దారి చూపించారు. ధైర్యమిచ్చారు సార్. ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను. మీకు ఒక్కటే చెప్పదలుచుకున్నా. నాకు ఇద్దరు చిన్న బాబులున్నారు. వారిని మీలాగా పెంచుకుంటాను. అంతకుమించి నేనేమీ చెప్పలేను. మీరిచ్చిన అవకాశాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. లవ్యూ’’ అంటూ మహేష్ తన అభిమానాన్ని చూపించిన తీరుకు అందరూ ఫిదా అయిపోయారు.

తరుణ్ సైతం ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. మహేష్ చాలా ఏళ్ల కిందటే తన పేరులోకి ‘భాస్కర్’ అనే పేరును చేర్చుకున్నాడు. ఇండస్ట్రీలో అతను మహేష్ భాస్కర్‌గానే పాపులర్. అవకాశం ఇచ్చిన వాళ్ల మీద ఇంతటి కృతజ్ఞత చూపించడం గొప్ప విషయం అంటూ నెటిజన్లు మహేష్‌ను.. అలాగే తనకు ఛాన్స్ ఇచ్చిన తరుణ్‌ను కొనియాడుతున్నారు.