వింక్ భామకు పిచ్చి ప్రశ్న

సోషల్ మీడియా ఎప్పుడు ఎవరికి ఎలా ఫేమ్ తెచ్చిపెడుతుందో ఊహించలేం. మలయాళ అమ్మాయి ప్రియ ప్రకాష్ వారియర్ అనుకోకుండా అలాగే ఫేమస్ అయిపోయింది. ‘ఒరు అడార్ లవ్’ అనే సినిమాలో ఆమె కన్ను కొట్టే క్లిప్ కొన్నేళ్ల ముందు ఎలా వైరల్ అయిందో, కొన్ని రోజుల్లో ప్రియను ఎలా స్టార్‌ను చేసిందో తెలిసిందే. నిజానికి ఆ సినిమా చాలా పేలవంగా ఉంటుంది. థియేటర్లలో రిలీజైనపుడు డిజాస్టర్ అయింది.

ఐతేనేం ప్రియకు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ చిన్న సీన్ వల్ల ఎక్కడలేని ఫేమ్ వచ్చింది. ఆ తర్వాత ఆమె బోలెడన్ని సినిమాలు చేసింది. ఎన్నో యాడ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌‌గానూ వ్యవహరించింది. తాజాగా ఆమె ఒక బ్రాండ్ ప్రమోషన్లో భాగంగా మీడియాను కలవడానికి వచ్చింది. ఆ సందర్భంగా ప్రియకు ఎదురైన ఒక పిచ్చి ప్రశ్న సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది.

తాను ప్రమోట్ చేస్తున్న బ్రాండుకు తగ్గట్లే ఆమె కాషాయ రంగు డ్రెస్సులో ఈ ఈవెంట్‌కు హాజరైంది. ఐతే ఒక జర్నలిస్టు మాత్రం మీరీ కలర్లో డ్రెస్ ఎందుకు వేశారు.. ఇందులో రాజకీయ ఉద్దేశాలేమైనా ఉన్నాయా అన్నట్లు ప్రశ్నించాడు. ఇది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కలర్ అని, ఆ పార్టీని ఇంప్రెస్ చేయడానికో, లేదంటే ఆ పార్టీ వాళ్ల ఒత్తిడితోనో ప్రియ కాషాయ రంగు డ్రెస్ వేసిందన్నది ఆ జర్నలిస్ట్ ఉద్దేశం. కానీ ప్రియ చాలా కూల్‌గా బ్రాండ్ ప్రమోషన్ కోసమే ఈ కలర్ డ్రెస్ వేశానని సమాధానం చెప్పి ఊరుకుంది.

కానీ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా..ఆ జర్నలిస్టు మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రతిదానికీ రాజకీయ రంగు పులిమి ఇలా సెలబ్రెటీలను ఇబ్బంది పెట్టడం ఎంత వరకు కరెక్ట్ అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దేశంలో ప్రతి పార్టీకీ ఒక రంగు ఉందని, అలాంటపుడు ఆయా రంగుల దుస్తులే ధరించకూడదా, అలా అంటే ఏ కలర్ మిగులుతుంది అన్న వాదన వినిపిస్తోంది. సెలబ్రెటీలు దొరికారు కదా అని, మైక్ ఉంది కదా అని ఇలాంటి ప్రశ్నలు ఎలా అడుగుతారు అంటూ సదరు జర్నలిస్టుపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.