తమిళంలో నంబర్‌వన్ హీరోగా ఉంటూ సినిమాలకు టాటా చెప్పేశాడు విజయ్. అతడికి ఎన్నో ఏళ్ల నుంచి గట్టి పోటీ ఇస్తున్న హీరో అజిత్ కుమార్. ఐతే మధ్యలో కొన్నేళ్లు అతడి జోరు కొంచెం తగ్గింది. కానీ గత ఏడాది గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో బలంగా పుంజుకున్నాడు. ఆ హిట్టు తర్వాత వెంటనే ఇంకో సినిమా చేస్తాడనుకుంటే.. ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్నాడు. ఎట్టకేలకు అజిత్ కొత్త సినిమాను అనౌన్స్ చేశారు.
గుడ్ బ్యాడ్ అగ్లీ దర్శకుడు, అజిత్‌కు వీరాభిమాని అయిన ఆధిక్ రవిచంద్రనే ఈ చిత్రాన్ని కూడా రూపొందించనున్నాడు. కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ ఈ సినిమా అజిత్ సొంత బేనర్లో తెరకెక్కనుంది. అతడికిదే తొలి సొంత సినిమా. అజిత్ భార్య షాలిని పేరు మొదటిసారిగా నిర్మాతగా పోస్టర్ మీద పడింది. తమిళ నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు.
గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాన్ని నిర్మించిన టాలీవుడ్ అగ్రశ్రేణి నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. అజిత్‌కు తన మార్కెట్ స్థాయిని మించి రూ.150 కోట్ల మేర పారితోషకం ఇచ్చినట్లు సమాచారం. ఐతే అదే రేంజిలో తర్వాతి సినిమాకు రెమ్యూనరేషన్ అడుగుతుంటే నిర్మాతలు ఎవ్వరూ ముందుకు రాలేదని తెలుస్తోంది. ఒక ప్రొడక్షన్ హౌస్ ముందుకు వచ్చినట్లే వచ్చి.. రెమ్యూనరేషన్ విషయంలో ఏకాభిప్రాయం కుదరక వెనక్కి తగ్గినట్లు వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలోనే అజిత్ స్వయంగా నిర్మాత అవతారం ఎత్తబోతున్నట్లు కొన్ని రోజుల ముందు సమాచారం బయటికి వచ్చింది. ఇప్పుడు ఆ వార్తనే నిజం అయింది. తనకు రావాల్సిన పారితోషకాన్నే పెట్టుబడిగా పెట్టి అజిత్ సినిమా చేయబోతున్నాడు. వచ్చే ఆదాయమంతా ఆయన ఖాతాలోకే చేరుతుంది. ఈ రకంగా ఇంకా ఎక్కువ మొత్తం అందుతుందని అజిత్ అంచనా వేస్తుండొచ్చు. ఈ మోడల్ క్లిక్ అయితే.. ఇకముందూ అజిత్ సొంత సినిమాలే చేసుకుంటాడేమో.
Gulte Telugu Telugu Political and Movie News Updates