రోమాంచకం… సరిపోతుందా సమయం

టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం మూడు సినిమాలే అయినా కల్ట్ ఫాలోయింగ్ తెచ్చుకోవడం తనకే చెల్లింది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఒకదాన్ని మించి మరొకటి బ్లాక్ బస్టర్ కావడంతో టి సిరీస్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ తనను అంటిపెట్టుకుని వందల కోట్ల ప్రాజెక్టులు లైన్ లో పెడుతోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న స్పిరిట్ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో మళ్ళీ చెప్పనక్కర్లేదు.

అలాంటి సందీప్ రెడ్డి వంగా ఒక బయట కథను మెచ్చుకుని తన స్వంత బ్యానర్ లో నిర్మించడమంటే విశేషమే. ఎన్నడూ లేనిది దీని కోసమే ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం గత రెండు మూడు రోజులుగా చూస్తున్నాం. ముఖ్యంగా చిరంజీవి గురించి ఆయన చెప్పిన విషయాలు బాగా వైరల్ అయ్యాయి. ఇవాళ జరిగిన ట్రైలర్ లాంచ్ లో సందీప్ మాట్లాడిన విధానం, ఎన్నడూ లేని విధంగా నవ్వుతూ జర్నలిస్టులతో సరదాగా జవాబులు చెప్పడంతో ఆ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందుకే రోమాంచకం మీద మూవీ లవర్స్ కు ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. గోదారి గట్టుపైన ఫేమ్ సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తుండగా అనంతిక హీరోయిన్ గా కనిపించనుంది.

ఇదంతా బాగానే ఉంది కానీ రోమాంచకం చుట్టూ పెద్ద వలయమే ఉంది. కేవలం వారం ముందు ‘టాక్సిక్’ దిగుతోంది. ఒకపక్క ‘ఇరుముడి’ స్ట్రాంగ్ గా ఉంది. సెప్టెంబర్ 3 రాబోతున్న రోమాంచకంకు కాంపిటీషన్ తక్కువేం లేదు. అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక, దుల్కర్ సల్మాన్ ఐ యాం గేమ్, చిన్న బడ్జెట్ అయినా కాసింత సౌండ్ చేస్తున్న సహతో పాటు పూర్తిగా కొత్త కథతో రూపొందిన వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్’ తెలుగు డబ్బింగ్ తో పాటు థియేటర్లలో అడుగు పెడుతోంది.

ఇలాంటి టఫ్ సిచువేషన్ లో రోమాంచనం చాలా గట్టిగా పోరాడాల్సి ఉంటుంది. ఒకవేళ సోలోగా వచ్చి ఉంటే ఇబ్బంది లేదు కానీ ఇలా ఇన్నేసి సినిమాల మధ్య ఎదురీదడం అంత సులభంగా ఉండదు. వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ లవ్ ఎంటర్ టైనర్ కు వాసుకి వైభవ్ సంగీతం సమకూరుస్తున్నారు. పాటలు వైరల్ కావడం లాంటివేవి జరగలేదు. ఈ మధ్య హీరోలందరికీ కంబ్యాక్ గా నిలుస్తున్న ఈ సీజన్ సుమంత్ ప్రభాస్ కు కూడా అలాంటి హిట్టు రోమాంచనం రూపంలో ఇస్తుందేమో చూడాలి.