టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా అందుకు మినహాయింపు కాదు. ఆయనకు మంచి సక్సెస్ రేట్ ఉంది కానీ.. ఆయన కూడా కొన్ని ఫెయిల్యూర్లను తప్పించుకోలేకపోయారు. ఐతే ‘ఖలేజా’ రిలీజైనపుడు దగ్గర డిజాస్టర్ అయినా.. తర్వాత టీవీల్లో ఆన్ లైన్లో గొప్ప ఆదరణ తెచ్చుకుని ఆయనకు మంచి పేరే తెచ్చిపెట్టింది. కానీ ‘అజ్ఞాతవాసి’ మాత్రం అలా కాదు.
అది ఆయన కెరీర్లో అతి పెద్ద మరకగా నిలిచిపోయింది. ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ కావడమే కాదు.. తర్వాత డిజిటల్‌గా రిలీజయ్యాక కూడా పూర్తి నెగెటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమా డిజాస్టర్ కావడం ఒకెత్తయితే.. ‘లార్గో వించ్’ అనే ఫ్రెంచ్ మూవీని కాపీ కొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కోవడం, ఆ సినిమా మేకర్స్‌కు నష్టపరిహారం కూడా కట్టాల్సి రావడం త్రివిక్రమ్ ఇమేజ్‌ను బాగా డ్యామేజ్ చేసింది.
‘అజ్ఞాతవాసి’ ఫెయిల్యూర్ గురించి మాట్లాడ్డానికి కూడా త్రివిక్రమ్ అంతగా ఇష్టపడరు. కానీ తాజాగా ఒక కార్యక్రమంలో ఈ సినిమా తాలూకు చేదు అనుభవం గురించి ఒక ఇన్‌స్పైరింగ్ స్టోరీ చెప్పారు త్రివిక్రమ్. మన జీవితంలో ఏదైనా పెద్ద ప్రతికూల విషయం జరిగితే దాన్ని దాచిపెట్టాల్సిన అవసరం లేదంటూ ‘అజ్ఞాతవాసి’ ఉదాహరణనే పంచుకున్నాడు మాటల మాంత్రికుడు.
‘అజ్ఞాతవాసి’ సినిమా తర్వాత తాను కొత్త ఇంటి నిర్మాణం మొదలుపెట్టానని.. కానీ ఆ సినిమా ఫెయిలవడంతో తాను మొత్తం రెమ్యూనరేషన్‌ను వెనక్కి ఇచ్చేయాల్సి వచ్చిందని.. దీంతో ఇంటి పని ఆగిపోయిందని ఆయన గుర్తు చేసుకున్నారు. నిర్మాత కూడా లాభం మొత్తం వదులుకున్నారని.. పవన్ కళ్యాణ్ కూడా పారితోషకంలో కొంత వెనక్కి ఇచ్చారని ఆయన వెల్లడించారు.
ఐతే తనకు ఏదో కష్టం వచ్చింది కదా అని దాన్ని భార్యాపిల్లల దగ్గర దాచాలనుకోవట్లేదని.. అప్పుడు తన పిల్లలు చిన్నవాళ్లే అని.. అయినా వాళ్ల దగ్గరికి వెళ్లి విషయం చెప్పానని.. ఇకముందూ మనం అద్దె ఇంట్లోనే ఉంటామని చెప్పానని.. దాన్ని వాళ్లు తేలిగ్గానే తీసుకున్నారని త్రివిక్రమ్ చెప్పాడు. దీంతో తన మీద భారం తగ్గిపోయిందన్నాడు.
తాను దాచిపెట్టాలన్నా దాగే నిజం అది కాదని.. పిల్లలకు అది అర్థమైపోతుందని.. తాను లోలోన బాధ పడుతుంటే వాళ్లు అర్థం చేసుకుని మరింత బాధ పడతారని.. అందుకే ఆ ఇబ్బంది లేకుండా తానే అసలు విషయం చెప్పేయడంతో అందరం ప్రశాంతంగా ఉన్నామని త్రివిక్రమ్ వివరించాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates