క్లైమాక్స్ మీద తీవ్ర విమర్శలు… డైరెక్టర్ రియాక్షనేంటి?

గత వారాంతంలో నేచురల్ స్టార్ నాని సినిమా ‘ది ప్యారడైజ్’ గురించి సోషల్ మీడియాలో ఎంత చర్చ జరిగిందో.. తమిళ చిత్రం ‘డొరోతీ’ గురించి కూడా అంతే డిస్కషన్ నడిచింది. పిజ్జా, జిగ‌ర్ తండ చిత్రాల ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బ‌రాజ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో కీర్తి సురేష్, రిషికాంత్, సనంత్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు క్రిటిక్స్ పాజిటివ్ రివ్యూలే ఇచ్చినప్ప‌టికీ.. సోష‌ల్ మీడియాలో మాత్రం డొరోతీని రిలీజ్ రోజు నుంచి విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

అందుక్కారణం.. ఈ సినిమా క్లైమాక్స్. డొరోతీ ఒక బోల్డ్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కింది. ఇందులో సనంత్ పాత్రను స్వ‌లింగ సంప‌ర్కుడిగా చూపించారు. అత‌ను త‌న స్నేహితుడే అయిన రిషికాంత్‌ను ప్రేమిస్తాడు. ముందు అత‌ణ్ని అస‌హ్యించుకున్న రిషికాంత్.. చివ‌రికి అత‌డి ప్రేమ‌ను అర్థం చేసుకుని ద‌గ్గ‌రికి తీసుకుంటాడు. అమ్మాయిగా మారిన స‌నంత్‌కు రిషికాంత్ లిప్ లాక్ ఇవ్వ‌డంతో ఈ సినిమా ముగుస్తుంది. ఈ సీన్ తీవ్ర దుమారం రేపింది. అంతే కాక‌.. ‘‘ప‌దేళ్లు పోయాక మేమే నార్మ‌ల్. మిమ్మ‌ల్నే తేడాగా చూస్తారు’’ అంటూ హిజ్రా పాత్ర చెప్పే డైలాగ్ కూడా చర్చనీయాంశం అయింది. క్లైమాక్స్ సీన్, ఈ డైలాగ్ విషయంలో విపరీతంగా ట్రోల్స్ పడుతున్నాయి.

ఎక్స్‌లో ఈ విమర్శలు, ట్రోల్స్ మీద దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కొంచెం ఘాటుగానే స్పందించాడు. ‘‘ట్విటర్ చాలా చిన్న ప్రపంచం. సినిమాకు చాలావరకు పాజిటివ్ రివ్యూలే ఉన్నాయి. కొందరు నెగెటివ్ ట్వీట్ల మీదే దృష్టిసారిస్తున్నారు. ఒక స్వలింగ సంపర్కుడి జీవితాన్ని సినిమాగా చూపించడం ఎవరికైనా ఇబ్బందిగా ఉందంటే.. అది వాళ్ల సమస్య’’ అని కార్తీక్ అన్నాడు. ఇక క్లైమాక్స్ లిప్ లాక్ సీన్ గురించి కార్తీక్ స్పందిస్తూ.. ఈ సన్నివేశాన్ని అందరూ అంగీకరిస్తారని తాను అనుకోలేదని చెప్పాడు.

ఇలాంటి సన్నివేశాలు ప్రేక్షకులకు అలవాటు లేదని.. కాబట్టి మిశ్రమ స్పందన ఊహించిందే అని అతనన్నాడు. కానీ ఎక్కువమంది ఈ సన్నివేశానికి కనెక్ట్ అయ్యారని.. అందులోని ఎమోషన్‌ను అర్థం చేసుకున్నారని.. చాలా థియేటర్లలో ఆ సీన్ చూసి చప్పట్లు కొడుతున్నారని చెప్పాడు. అంతిమంగా ఆ సన్నివేశం సరైన మార్గంలోనే ప్రేక్షకులకు రీచ్ అయిందని భావిస్తున్నానన్నాడు. ఇక వివాదాస్పద డైలాగ్ గురించి కార్తీక్ మాట్లాడుతూ.. ఇది 90వ దశకంలో నడిచే కథ అని, అప్పటికి హిజ్రాలను మరోలా చూసేవారని, పదేళ్ల తర్వాత పరిస్థితిమారి, వాళ్లను నార్మల్‌గా చూడడం మొదలుపెడతారనే ఉద్దేశంతో ఆ డైలాగ్ పెట్టినట్లు కార్తీక్ వివరించాడు.