క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరొందిన పావలా శ్యామల కన్ను మూశారు. గత కొన్నేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న శ్యామల గారికి పలు సందర్భాల్లో కొందరు టాలీవుడ్ ప్రముఖులు ఆర్థిక సహాయం చేసినప్పటికీ సమస్య మరీ తీవ్రం కావడంతో ఇటీవలే ఉస్మానియా ఆసుపత్రిలో చేరారు. కూతురు కూడా అస్వస్థతకు గురి కావడంతో దగ్గరుండి చూసుకునే వాళ్ళు లేకుండా పోయారు. ఇప్పటి తరం ఆడియన్స్ కి గోపీచంద్ గోలీమార్ సినిమా ద్వారా శ్యామల గారు పాపులారిటీ తెచ్చుకున్నారు.
1951 గుంటూరు జిల్లా అమరావతిలో శ్యామల జన్మించారు. ప్రముఖ రచయిత గణేష్ పాత్రో రచించిన పావలా నాటకమే ఆవిడ ఇంటి పేరుగా మారిపోయింది. చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో తండ్రే పెంచారు. పదమూడేళ్ల వయసులోనే శ్యామలకు వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కలిగిన కొన్నేళ్లకే భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోవడం ఊహించని విషాదాన్ని తీసుకొచ్చింది. కుటుంబ పోషణ భారం ఆవిడ మీదే పడింది. నాటకాలు, టీవీ సీరియల్స్ లో నటించడం ద్వారా ఉపాధి చూసుకున్నారు.
చిరంజీవి ఛాలెంజ్ తో శ్యామల ఎంట్రీ ఇచ్చినప్పటికీ తొలి గుర్తింపు వచ్చింది జంధ్యాల బాబాయ్ అబ్బాయి సినిమాతో. కె విశ్వనాధ్ గారి స్వర్ణకమలంలో వేసిన పని మనిషి వేషం బాగా పేరు తీసుకొచ్చింది. అక్కడి నుంచి అవకాశాలు వచ్చాయి. కర్తవ్యం, దండోరా, చీమలదండు, సుస్వాగతం, మనసంతా నువ్వే, ఇంద్ర, వర్షం, గౌరీ లాంటి ఎన్నో సూపర్ హిట్స్ లో చెప్పుకోదగ్గ క్యారెక్టర్స్ చేశారు. అయితే నిడివి తక్కువగా ఉండటం వల్ల గుర్తింపు కూడా అలాగే ఉండేది.
2019 మత్తువదలరా తర్వాత శ్యామల మళ్ళీ తెరమీద కనిపించలేదు. పూరి జగన్నాథ్, పవన్ కళ్యాణ్ లాంటి ప్రముఖులు తరచు ఆర్థిక సహాయం చేసినప్పటికీ తీవ్ర అనారోగ్యం శ్యామల గారిని వెంటాడింది. వంద సినిమాలకు పైగా నటించినా బలంగా స్థిరపడలేకపోయారు. లలితా కళాపరిషత్, కాకతీయ కళాపరిషత్, ఏపీ ప్రభుత్వం అందించిన హంస పురస్కారం లాంటి ఘనతలు శ్యామల సాధించారు. భౌతికంగా లేకపోయినా శ్యామల గారి పాత్రలు ప్రేక్షకులు చిరస్మరణీయంగా ఉండిపోతాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates
