సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్ మార్కెట్ ని బాగా దెబ్బ తీశాయి. ప్యాన్ ఇండియా లెవెల్ లో ట్రై చేద్దామని ఆ మధ్య జటాధరలో నటిస్తే అదేమో దారుణంగా డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు ప్రస్తుతం తను ఏ సినిమా ఓకే చేశాడో కూడా తెలియనంతగా అప్డేట్స్ ఆగిపోయాయి. ఇదిలా ఉండగా సుధీర్ బాబు త్వరలో తన స్వంత కథతో స్వీయ దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని డిసైడైనట్టుగా సమాచారం.
ఇలా ఎందుకనే సందేహం రావడం సహజం. హీరోలను మెప్పించే దర్శకులు క్రమంగా తగ్గిపోతున్నారు. కథల పరంగా ఇంప్రెస్ చేస్తున్నారు కానీ తీరా అవి తెరమీదకు వచ్చేటప్పటికి నిరాశ పరుస్తున్నాయి. అందుకే ఎనర్జిటిక్ స్టార్ రామ్ మెగా ఫోన్ పట్టుకున్నాడు. కిరణ్ అబ్బవరం ఆల్రెడీ తన డెబ్యూ డైరెక్షన్ లో ఒక షెడ్యూల్ పూర్తి చేశాడు. విశ్వక్ సేన్ కల్ట్ నిర్మాణంలో ఉంది. వీళ్ళందరూ సక్సెస్ కోసం తపించి పోతున్నవాళ్ళే. అర్జెంట్ గా హిట్టు కోరుకుంటున్న బ్యాచ్.
బహుశా అందుకే సుధీర్ బాబు స్వంతంగా దర్శకత్వం వైపు ఆలోచన చేసి ఉండొచ్చు. నిజానికీ రెండు పడవల ప్రయాణం చాలా రిస్క్. పవన్ కళ్యాణ్ జానీ ఏమయ్యిందో చరిత్ర మర్చిపోదు. అలాని అందరికీ ఫెయిల్యూర్స్ రావు. ధనుష్ తొలినాళ్ళలో దర్శకుడిగా హిట్లు కొట్టాడు. ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ లాంటి సీనియర్లు ఇండస్ట్రీ హిట్లు ఇచ్చారు. నేరుగా కాకపోయినా అడివి శేష్, నవీన్ పోలిశెట్టి సినిమాల్లో వాళ్ళ ప్రమేయం చాలా విషయాల్లో ఉంటుందనేది ఓపెన్ సీక్రెట్.
ఇప్పటికైతే అధికారికంగా ప్రకటించలేదు కానీ త్వరలోనే సుధీర్ బాబు ప్రాజెక్టు గురించి త్వరలో ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కృష్ణ ఫ్యామిలీలో మహేష్ ఒక్కడే స్టార్ అయ్యాడు కానీ ఇంకెవరు దరిదాపుల్లో లేదు. సుధీర్ బాబు ఎంత కష్టపడుతున్నా, వేర్వేరు జానర్లు చేస్తున్నా రిజల్ట్ ఒకటే వస్తుంది. అందుకే యాక్టింగ్ ప్లస్ డైరెక్షన్ నిర్ణయం తీసుకున్నాడేమో. చూస్తుంటే జెన్ జీ హీరోలు కేవలం నటనకే పరిమితం కాకుండా దర్శకత్వం వైపు కూడా ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
