ధనుష్ నుంచి ఇది నేర్చుకోవచ్చు

స్టార్ హీరోలకు వేగం అవసరం. ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ, చిరంజీవి లాంటి వాళ్ళు ఏడాదికి పది నుంచి పదిహేను సినిమాలు చాలా ఈజీగా చేసేవాళ్ళు. కుటుంబానికి టైం ఇవ్వడం కన్నా అదేదో దర్శక నిర్మాతలకు ఇవ్వడం ద్వారా పరిశ్రమతో పాటు ఆర్థికంగా తామూ బాగుంటామనే ఉద్దేశంతో పరుగులు పెట్టేవాళ్ళు. దానికి తగ్గట్టే ప్రేక్షకుల ఆదరణ కూడా ఉండేది. మరీ దారుణంగా ఉంటే తప్ప యావరేజులు కూడా వందరోజులు ఆడిన దాఖలాలు, సృష్టించిన రికార్డులు ఎన్నో.

ఇప్పుడీ ప్రస్తావనకు కారణం ధనుష్. ఇవాళ తన కొత్త మూవీ మొదలయ్యింది. ప్రీతీ ముకుందన్ హీరోయిన్ గా తమిళరసన్ పచ్చముత్తు దర్శకత్వంలో రూపొందనుంది. ఈయన గతంలో తీసిన లబ్బర్ పంతు పెద్ద హిట్టయ్యింది. దీన్నే తెలుగులో రాజశేఖర్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో రీమేక్ చేస్తున్నారు. మదురైలో జరిగిన ధనుష్ 56 పూజా ఈవెంట్ కి భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ఇందులో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాణ భాగస్వామి. గతంలో సార్ తీసిన సంగతి తెలిసిందే.

ధనుష్ కేవలం స్పీడుగా సినిమాలు చేయడం వల్లే ప్రత్యేకత రావడం లేదు. వీలు దొరికి మంచి కథ కుదిరితే దర్శకత్వం కూడా చేస్తున్నాడు. రాయన్ కు ఇటీవలే జాతీయ అవార్డు అందుకున్నాడు. అలాని తానేమి వరస సక్సెస్ లో లేడు. కర దారుణంగా పోయింది. ఇడ్లి కడాయి, కుబేర, తేరే ఇష్క్ మే కొన్ని భాషల్లో అస్సలు వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఓమ్ కూడా ఆల్రెడీ రెండు వాయిదాలు వేసుకుంది. డిసెంబర్ కంటే ముందే వచ్చే సూచనలు లేవు.

ఇన్ని ఇబ్బందులు ఉన్నా స్పీడ్ ఆపకపోవడమే ధనుష్ ప్రత్యేకత. ఇప్పుడీ 56వ సినిమా దేవుడి నేపథ్యంలో డివోషనల్ టచ్ తో ఉంటుందని ఇన్ సైడ్ టాక్. యుగానికి ఒక్కడు 2 తనతో తీయాలని అన్నయ్య సెల్వ రాఘవన్ అనుకున్నప్పటికీ ఎందుకో ఆది ముందుకు సాగడం లేదు. గాయకుడిగా, రచయితగా కూడా అప్పుడప్పుడు తన ముద్ర చూపించే ధనుష్ సార్ తర్వాత మళ్ళీ తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేయలేదు. సీక్వెల్ ఆలోచన ఉంది కానీ అవుతుందో లేదో వెంకీ అట్లూరి చేతిలో ఉంది.