సంక్రాంతి సినిమాల తర్వాత నాలుగైదు నెలల పాటు బాక్సాఫీస్ దగ్గర పెద్ద స్లంప్ చూసింది టాలీవుడ్. కానీ గత నెలలో ‘పెద్ది’ దగ్గర్నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఆ సినిమా ఊపును తర్వాత మా ఇంటి బంగారం, లెనిన్ కొనసాగించాయి. ఈ వరుసలో ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న కొత్త చిత్రం.. చెన్నై లవ్ స్టోరీ.
‘బేబీ’ టీం తీసిన సినిమా కావడం.. మణిశర్మ అందించిన పాటలు పాపులర్ కావడం, మిగతా ప్రోమోలు కూడా ఆకట్టుకోవడంతో ఈ చిత్రానికి పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. ‘బేబీ’ తరహాలోనే ఈ చిత్రానికి రిలీజ్ ముందు రోజే పెద్ద సంఖ్యలో పెయిడ్ ప్రిమియర్స్ వేస్తున్నారు. వాటికి రెస్పాన్స్ కూడా బాగుంది. ఇక ఈ చిత్రానికి ప్రిమియర్స్ నుంచి ఎలాంటి టాక్ వస్తుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఐతే ప్రిమియర్స్ పడడానికి ముందే ‘చెన్నై లవ్ స్టోరీ’కి కలిసొచ్చే పరిణామం జరిగింది. ఈ వారం ఈ చిత్రానికి పోటీగా విడుదలైన తమిళ అనువాద చిత్రం ‘జననాయకుడు’ బ్యాడ్ టాక్ తెచ్చుకుంది. విజయ్‌కి గత దశాబ్ద కాలంలో తెలుగులో మంచి ఫాలోయింగ్, మార్కెట్ వచ్చాయి. తన సినిమాలకు మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి. ‘జననాయగన్’ విజయ్ చివరి చిత్రం కావడంతో ఇక్కడి ప్రేక్షకుల్లోనూ దానిపై కొంత క్యూరియాసిటీ కనిపించింది.
సరైన పబ్లిసిటీ లేకుండా రిలీజ్ చేయడం మైనస్ అయినా.. పెద్ద హీరో నటించిన కమర్షియల్ మూవీ కాబట్టి జనం బాగానే చూసేవారు. కానీ ‘జననాయకుడు’కు తెలుగులో ఔట్ రైట్ రిజెక్షన్ కనిపిస్తోంది. రివ్యూలు చాలా బ్యాడ్‌గా ఉండగా, సోషల్ మీడియా ఫీడ్ బ్యాక్ కూడా ఏమాత్రం ఆశాజనకంగా లేదు. అసలే ఇది రీమేక్, పైగా టాక్ బాలేదన్నపుడు జనం ఎందుకు చూస్తారు?
గురువారం ఈ చిత్రానికి పెద్ద ఎత్తున స్క్రీన్లు, షోలు ఇచ్చారు. కానీ ఉదయం టాక్ తర్వాత ఆక్యుపెన్సీలు అంతంతమాత్రంగా ఉన్నాయి. కాబట్టి విజయ్ సినిమా నుంచి ‘చెన్నై లవ్ స్టోరీ’కి ముప్పు తొలగిపోయినట్లే. ఈ చిత్రానికి మంచి టాక్ వస్తే.. ‘జననాయకుడు’కు ఇచ్చిన షోలు, స్క్రీన్లను తీసి దీనికే ఇచ్చే అవకాశముంది. మరి ఈ అడ్వాంటేజీని సినిమా ఎంతమేర ఉపయోగించుకుంటుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates
