తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమాగా ఆయనే స్వయంగా చెప్పుకుంటూ వచ్చిన జన నాయకుడు అష్టకష్టాలు దాటుకుని ఎట్టకేలకు థియేటర్లలో అడుగు పెట్టేసింది. కర్ణాటకలో ఉదయం ఆరు గంటలకే షోలు పడిపోగా తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిది గంటలకు తమిళనాడులో తొమ్మిది గంటలకు ప్రారంభమయ్యాయి. విజయ్ స్వంత రాష్ట్రంలో బ్లాక్ టికెట్లు విచ్చలవిడిగా అమ్మినట్టు కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడాన్ని టీవీకే పార్టీ సీరియస్ గా తీసుకుని విచారణ చేస్తోంది.
ఆరు నెలలకు పైగా సెన్సార్ వివాదం వల్ల ల్యాబ్ లోనే మగ్గిన జన నాయకుడు మీద తమిళనాడులో క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని బుకింగ్స్ స్పష్టం చేస్తున్నాయి. చెన్నైలో ఉన్న మాయాజాల్ పదహారు స్క్రీన్ల మల్టీప్లెక్సులో రోజు మొత్తం కలిపి ఒక్క టికెట్ అందుబాటులో లేదంటే క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్కడే కాదు కోయంబత్తూర్, పెరంబూరు లాంటి పట్టణాలు నగరాలు ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వీకెండ్ దాకా పెద్దగా మార్పు ఉండకపోవచ్చు.
ఒకవేళ విజయ్ అధికారంలో రాకపోయి ఉంటే ఎలా ఉండేదో కానీ తలపతిని సిఎంగా చూసుకుంటూ ఇప్పుఈ సినిమాను సెలెబ్రేట్ చేసుకోవడం ఫ్యాన్స్ ఎమోషనల్ గా తీసుకుంటున్నారు. ఇది ఎక్కడి దాకా వెళ్లిందంటే 25 రోజులకు జరిపే ఫ్యాన్ షో ఇప్పుడే హౌస్ ఫుల్ అయ్యేంత. మొదటి రోజు రికార్డు ఓపెనింగ్ ఖాయమే కానీ అది ఎంత మొత్తంలో ఉంటుందనేది రేపటికి క్లారిటీ రానుంది. కొంత కాలంగా తమిళంలో చెప్పుకోదగ్గ స్టార్ సినిమా లేకపోవడం పెద్ద ప్లస్ కానుంది.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే భగవంత్ కేసరి రీమేక్ కావడం వల్ల లియో లాంటి వాటితో పోలిస్తే జన నాయకుడుకు వచ్చిన బజ్ తక్కువే. అయినా సరే బుకింగ్స్ డీసెంట్ గా ఉన్నాయి. ఒకవేళ టాక్ పాజిటివ్ గా వస్తే అది సానుకూలంగా మారొచ్చు కానీ అంత సులభమైతే కాదు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన జన నాయకుడులో మమిత బైజు, ప్రకాష్ రాజ్, బాబీ డియోల్ ఇతర ప్రముఖ తారాగణం. రాజకీయాల దృష్ట్యా విజయ్ దాదాపు ఇక సినిమాలు చేసే ఛాన్స్ లేనట్టే.
Gulte Telugu Telugu Political and Movie News Updates
