సినిమాల్లో ఎమోషన్స్ ని పండించడానికి రకరకాల సెంటిమెంట్లను వాడుతుంటారు. వాటిల్లో ‘చిన్న పాప’ సెంటిమెంట్ కి ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. హీరో ఎంత వైలెంట్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తి అయినా, ఒక చిన్న పాప చుట్టూ తిరిగే ఎమోషన్ కథకు తోడైతే థియేటర్లలో ఆ ఇంపాక్ట్ వేరేలా ఉంటుంది. రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్ లో వస్తున్న ‘ఇరుముడి’ సినిమా డీటెయిల్స్ చూస్తే మళ్లీ ఇదే లైన్ కనిపిస్తోంది.
వైలెంట్ పాస్ట్ ఉన్న ఒక తండ్రి, తన కూతురి కోసం అయ్యప్ప దీక్ష తీసుకుని మారే కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. దాంతో ఈ సెంటిమెంట్ రవితేజకు ఏ రేంజ్ లో హెల్ప్ అవుతుందనే చర్చ మొదలైంది. రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచిన విక్రమార్కుడు, కిక్ సినిమాల్లో కూడా ఈ చిన్న పాప ఎమోషన్ చాలా కీలకంగా నిలిచింది. విక్రమార్కుడులో అత్తిలి సత్తిబాబు క్యారెక్టర్ ఆ పాప చుట్టూ తిరిగే డ్రామాతోనే నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. ఇక కిక్ లో కథలో కీలకమైన పాప సెంటిమెంట్ సినిమా రేంజ్ ను మార్చేసింది.
రవితేజ సినిమాలే కాదు, ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో వచ్చిన ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాల్లో ఈ ఎలిమెంట్ వర్కౌట్ అయింది. బాలకృష్ణ నటించిన అఖండ, కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాల్లో కూడా చిన్న పాప క్యారెక్టర్ కథను మలుపు తిప్పేలా ఉంటుంది. గ్లోబల్ హిట్ సాధించిన ఆర్ఆర్ఆర్ సినిమాను గమనిస్తే, అందులో ఎన్టీఆర్ క్యారెక్టర్ జర్నీ మొత్తం ‘మల్లి’ అనే చిన్న పాపను కాపాడటం చుట్టూనే స్టార్ట్ అవుతుంది. ఆ ఎమోషనే కథకు మెయిన్ డ్రైవింగ్ ఫోర్స్ గా నిలిచింది.
అలాగే నాని నటించిన హాయ్ నాన్న సినిమా పూర్తిగా తండ్రి కూతుళ్ల బంధం చుట్టూనే సాగి బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకుంది. ఈ ఉదాహరణలన్నీ చూస్తుంటే కథలో చిన్న పాప ట్రాక్ ఉంటే ఆడియన్స్ కి ఈజీగా కనెక్ట్ అవుతుందనే నమ్మకం ఇండస్ట్రీలో కనిపిస్తోంది. అయితే ఒక చిన్న పాప క్యారెక్టర్ ను కథలో పెట్టేసినంత మాత్రాన సినిమా హిట్ అయిపోతుందని చెప్పలేం. గతంలో వెంకటేష్ నటించిన సైంధవ్, డాకు మహారాజ్ లాంటి సినిమాల్లో కూడా ఈ సెంటిమెంట్ ఉన్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన రిజల్ట్ రాలేదు.
అలాగే మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో వచ్చిన డాడీ సినిమా బాగున్నప్పటికీ అప్పట్లో కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాలేదు. దీన్ని బట్టి చూస్తే కేవలం సెంటిమెంట్ ఉంటే సరిపోదని, దాన్ని నడిపించే కంటెంట్ లో కూడా సాలిడ్ దమ్ముండాలని అర్థమవుతుంది. సినిమా ఏదైనా సరే కోర్ కంటెంట్ పర్ఫెక్ట్ గా క్లిక్ అయినప్పుడు మాత్రమే ఇలాంటి ఎమోషన్స్ వర్కౌట్ అవుతాయి. ఇరుముడి సినిమా విషయానికి వస్తే, డైరెక్టర్ శివ నిర్వాణకు ఫ్యామిలీ ఎమోషన్స్ ను చాలా న్యాచురల్ గా స్క్రీన్ పై పండించగల దర్శకుడిగా మంచి పేరుంది. ఇప్పుడు కూతురి సెంటిమెంట్ ను యాడ్ చేసి ఎలాంటి కంటెంట్ రెడీ చేశాడనేది ఆసక్తికరంగా మారింది. ఆగస్ట్ 21న రాబోతున్న ఈ చిత్రం ఈ సెంటిమెంట్ ను ఎంతవరకు హైలెట్ చేస్తుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates