బాక్సాఫీస్ వద్ద సునామిలాగా విరుచుకుపడుతున్న ది ఒడిస్సి షూటింగ్ కేవలం 93 రోజుల్లో అయిపోయిందంటే నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం. ఐమాక్స్ ఫార్మాట్ లో ఒక సన్నివేశం తీయాలంటే ఒక్కో షాట్ మధ్య కనీసం పావు గంట గ్యాప్ తీసుకోవాలి. ఎందుకంటే కెమెరా సెటప్ అంత క్లిష్టంగా ఉంటుంది. అయినా సరే దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ మొక్కవోని దీక్షతో అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేశారు. ఆయన ఎక్కువ సమయం తీసుకున్నది పోస్ట్ ప్రొడక్షన్ కు తప్ప చిత్రీకరణకు కాదు.
కానీ మన దగ్గర చూస్తేనేమో ప్యాన్ ఇండియా పేరుతో హీరోలు ఏళ్లకేళ్లు ఒకే సినిమా మీద టైం వేస్ట్ చేస్తున్నారు. పోనీ అన్నీ బ్లాక్ బస్టర్ అవుతున్నాయా అంటే అదీ లేదు. ఒక సినిమా తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడితే ఓవర్సీస్, ఉత్తరాది సైడ్ పోతుంది. మరో కల్ట్ మూవీ యుఎస్ లో మిలియన్ వసూలు చేసింది కానీ ఇక్కడ సి సెంటర్ మొదటి రోజే డెఫిషిట్ చూపిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కథలు ఎన్నో వ్యథలు ప్రొడ్యూసర్ కన్నీళ్ల రూపంలో నిత్యం కనిపిస్తూనే ఉంటాయి.
దీన్ని పొరపాటు అనాలో తప్పు అనాలో కానీ హీరోలు దర్శకుల ఆలోచనా ధోరణి మారాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇలా సంవత్సరాల తరబడీ ఒకే సినిమా మీద పని చేయడం వల్ల కెరీర్ మొత్తం మీద స్టార్ హీరోలు మహా అయితే నలభై నుంచి యాభై కన్నా ఎక్కువ సినిమాలు చేయలేని పరిస్థితి తలెత్తుతోంది. చిరంజీవి నూటా అరవైకి దగ్గరలో ఉంటే బాలకృష్ణ నూటా పన్నెండు దగ్గర బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ జనరేషన్ ఈ నెంబర్లు కల్లో కూడా చూడలేరు.
కర్ణుడి చావుకు వేయి కారణాలు అన్నట్టు టాలీవుడ్ లో ఈ ఆలస్యాల పర్వాల గురించి చెప్పుకుంటూ పోతే పుస్తకాలు రాయొచ్చు. రెండు వేల కోట్ల బడ్జెట్ ని నోలన్ కేవలం మూడు నెలల్లో షూటింగ్ చేయగలిగినప్పుడు మనమెందుకు కనీసం ఏడాదిలో పూర్తి చేయలేమని ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. ఇప్పటికిప్పుడు సమాధానం దొరక్కపోవచ్చు కానీ క్రమంగా పని చేసే పద్దతిని మార్చుకుని వేగంగా సినిమాలు వచ్చి అందరికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఈ దిశగా ఆలోచించేది ఎవరు.
Gulte Telugu Telugu Political and Movie News Updates