తాను పని చేసే సినిమాలకు ఎలివేషన్లు ఇవ్వడంలో తమన్ తర్వాతే ఎవ్వరైనా. సినిమా గురించే కాక తన వర్క్ గురించి కూడా గొప్పగా చెప్పి అభిమానుల్లో అంచనాలు పెంచేస్తుంటాడు. ఈ క్రమంలో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ కూడా అందిస్తుంటాడు. తమన్ తాజాగా మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు నాడు అభిమానులకు పెద్ద ట్రీటే ఉంటుందని సంకేతాలు ఇచ్చాడు.
ఇంతకుముందు చిరు నటించిన ‘గాడ్ ఫాదర్’ చిత్రానికి తమన్ అందించిన మ్యూజిక్ అంచనాలను అందుకోలేకపోయింది. ఐతే అది పూర్తి మాస్, కమర్షియల్ టచ్ ఉన్న సినిమా కాదు. ఆ తర్వాత ఓ సందర్భంలో చిరుతో అసలైన మాస్ సినిమా చేస్తే అప్పుడు కథ వేరుగా ఉంటుందని తమన్ ఒక పోస్టులో కామెంట్ చేశాడు. దాన్ని ఓ మెగా అభిమాని గుర్తు చేస్తూ.. తమన్‌ను ఎక్స్‌లో ట్యాగ్ చేశాడు.
దీనికి బదులిస్తూ ఎంతైనా ఊహించుకోండి, ఆగస్టు 22న మామూలుగా ఉండదంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం చిరు.. ‘వాల్తేరు వీరయ్య’ దర్శకుడు బాబీ కొల్లితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఊర మాస్‌గా ఉండబోతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. తమన్ కూడా ఆ విషయాన్ని ధ్రువీకరించడమే కాక.. చిరు పుట్టిన రోజు నాడు ఆ మూవీ గ్లింప్స్ రిలీజవుతుందని చెప్పకనే చెప్పాడు.
దీంతో మెగా అభిమానుల్లో ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ‘వాల్తేరు వీరయ్య’ కాంబినేషన్ అంటే మామూలుగానే అంచనాలు ఎక్కువ ఉంటాయి. పైగా బాబీ ఆ తర్వాత చేసిన ‘డాకు మహరాజ్’ మంచి ఫలితాన్నందుకుంది. మరోవైపు చిరు చివరి చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ రీజనల్ ఇండస్ట్రీ హిట్ అయింది. ఇలాంటి టైంలో ఇద్దరూ కలిసి చేసిన సినిమా అంటే హైప్ వేరే లెవెల్లో ఉంటుంది. తమన్ కూడా హైప్ ఎక్కిస్తుండడంతో టీజర్ ఒక రేంజిలో ఉంటుందని ఆశించవచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates