తెలుగు టాప్ కొరియోగ్రాఫర్లయిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పరస్పరం అరుచుకుంటూ ఒకరి మీదికి ఒకరు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ డ్యాన్సర్స్ ఫెడరేషన్ అధ్యక్షురాలిగా ఉన్న జానీ మాస్టర్ భార్య సుమలత.. ఏకపక్షంగా సమాఖ్యకు ఉప ఎన్నికలు ప్రకటించడంతో వివాదం రాజుకున్నట్లుగా తెలుస్తోంది.
ఇందుకు నిరసనగా పది మంది డ్యాన్సర్లు ఫెడరేషన్‌కు రాజీనామా చేయడం.. శేఖర్ వర్గం దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ జానీ మాస్టర్ బృందంతో గొడవ పడడం చర్చనీయాంశమైంది. ఐతే ఈ వీడియో వైరల్ కావడంతో వ్యవహారం మెగాస్టార్ చిరంజీవి వరకు వెళ్లింది. బాబీ దర్శకత్వంలో కొత్త సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ.. చిరు చొరవ తీసుకుని ఈ గొడవను పరిష్కరించడం విశేషం.
తన సినిమా సెట్‌కు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ ఇద్దరినీ పిలిపించుకుని మరీ చిరు ఈ గొడవను పరిష్కరించారు. ఐతే షూటింగ్ మధ్యలో ఉండడం వల్ల చిరు లుక్ లీక్ అవుతుందని ఆయన ముఖం కనిపించనివ్వకుండా శేఖర్, జానీ ఆయనతో కలిసి కూర్చున్న ఫొటోను మీడియాకు రిలీజ్ చేశారు. దీంతో ఈ వ్యవహారం సుఖాంతం అయినట్లయింది. చిరు మరోసారి ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అనే సంగతి ఈ సందర్భంగా రుజువైంది.
చిరు దగ్గర పంచాయితీ తేలిన అనంతరం జానీ మాస్టర్ మీడియా ముందుకు వచ్చాడు. శేఖర్‌కు, తనకు గొడవలేమీ లేవని.. తామిద్దరం మంచి మిత్రులమని అతను స్పష్టం చేశాడు. డ్యాన్సర్స్ ఫెడరేషన్‌లో చిన్న సమస్య ఉందని.. దాని వల్లే ఇదంతా జరిగిందని.. నిజానికి ఆ గొడవతో తనకు గానీ, శేఖర్ మాస్టర్‌కు గానీ.. మిగతా ఏ డ్యాన్స మాస్టర్‌కు గానీ ఏ సంబంధం లేదని అతను స్పష్టం చేశాడు. కుటుంబంలో కూడా చిన్న చిన్న అభిప్రాయభేదాలు ఉంటాయని.. ఒకరు గట్టిగా మాట్లాడితే, ఇంకొకరు చిన్నగా మాట్లాడతారని.. అంతమాత్రాన గొడవలున్నట్లు కాదని.. ఇది కూడా అలాంటిదే అని జానీ స్పష్టం చేశాడు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిపై జానీ ప్రశంసలు కురిపించాడు. ఆయన వల్లే ఈ రోజు ఇండస్ట్రీలో ఇంతమంది డ్యాన్సర్లు, ఫైట్ మాస్టర్లు ఉన్నారని అతను వ్యాఖ్యానించాడు. చిరంజీవి సినిమాల్లో డ్యాన్సులు, ఫైట్లు చూసే ఊర్లలో ఉండే తన లాంటి ఎంతోమంది ఇన్‌స్పైర్ అయి ఇండస్ట్రీకి వచ్చామని.. ఆయన వల్లే ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్నామని.. తమ అందరి చేతి వేళ్లు నోట్లోకి వెళ్తున్నాయంటే చిరంజీవే కారణమని జానీ కొనియాడాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates