బ్రహ్మి సినిమాలు చేయట్లేదు.. ఐతేనేం

తెలుగు సినీ చరిత్రలో బ్రహ్మానందంను మించిన కమెడియన్ లేడు. ఆ మాటకొస్తే బ్రహ్మి స్థాయిలో సుదీర్ఘ కాలం నవ్వించిన కమెడియన్ ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే లేడన్నా కూడా అతిశయోక్తి కాదు. ప్రపంచ స్థాయిలో కూడా ఇంత లాంగెవిటీ, ఇంత క్వాలిటీ కామెడీ అందించిన కమెడియన్ ఉన్నాడా అంటే సందేహమే. మూడు దశాబ్దాల పాటు తెలుగు సినిమాల్లో ఆయన హవా సాగింది. ఐతే మధ్య మధ్యలో వేరే కమెడియన్ల జోరుతో బ్రహ్మి హవా కొంచెం తగ్గినట్లు అనిపించినా.. ఆయన మళ్లీ పుంజుకున్నారు. శ్రీను వైట్ల, త్రివిక్రమ్ శ్రీనివాస్, వి.వి.వినాయక్ లాంటి దర్శకులు ఆయనకు అద్భుతమైన పాత్రలిచ్చి బ్రహ్మి ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసేలా చేశారు. సినిమాలతో బ్రహ్మి ఎంతగా అలరించారో సోషల్ మీడియాలో మీమ్స్ సంస్కృతి మొదలయ్యాక ఆయన పాపులారిటీ ఎన్నో రెట్లు పెరిగిపోయింది. బ్రహ్మి ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది.

బ్రహ్మి కొన్నేళ్లుగా సినిమాల్లో పెద్దగా కనిపించని సంగతి తెలిసిందే. ఇందులో ఆయన లోపం ఏమీ లేదు. రచయితలు, దర్శకులు కాలానుగుణంగా బ్రహ్మికి సరైన పాత్రలు ఇవ్వలేకపోయారు. ఆయన కామెడీ కొంచెం మొహం మొత్తేసింది. వరుసగా కొన్ని క్యారెక్టర్లు ఫెయిలయ్యాయి. దీంతో బ్రహ్మిని ఇండస్ట్రీ పక్కన పెట్టేయడం మొదలుపెట్టింది. ఆయన కూడా సినిమాలు తగ్గించేసుకుని ఇంటికి పరిమితం అయ్యారు. తనకెంతో ఇష్టమైన చిత్రలేఖనంలో బిజీ అయిపోయారు. ఐతే ఒక నటుడికి సినిమాలు తగ్గిపోయి తెరపై కనిపించడం మానేశాడంటే.. ఆటోమేటిగ్గా లైమ్ లైట్లోంచి వెళ్లిపోతాడు. జనాల చర్చల్లో ఉండడు. వారి ఆలోచనల్లోంచి వెళ్లిపోతాడు. కానీ బ్రహ్మి మాత్రం ఇందుకు భిన్నం. ఈ సోషల్ మీడియా కాలంలో బ్రహ్మిని విస్మరించడం సాధ్యం కాదన్నది ఏ ఫ్లాట్ ఫామ్ చూసినా అర్థమవుతూ ఉంటుంది.

ఎవరు ఏ ఎక్స్‌ప్రెషన్ ఇవ్వాలన్నా.. ఏ మీమ్ తయారు చేయాలన్నా బ్రహ్మిని ఆశ్రయించక తప్పదు. ఏ సందర్భానికి ఏ ఎక్స్‌ప్రెషన్ కావాలంటే అది బ్రహ్మి దగ్గర దొరుకుతుంది. జనాలు రాతలతో, మాటలతో బదులివ్వడం మానేసి.. బ్రహ్మి ఎక్స్‌ప్రెషన్ తీసుకుని దాంతోనే బదులిస్తారు. ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్సాప్.. ఇలా ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ చూసినా బ్రహ్మి హావభావాల ఫొటోలు, జీఐఎఫ్‌లు, మీమ్స్ కోకొల్లలు. కేవలం తెలుగు వాళ్లు మాత్రమే కాదు.. ఇతర భాషల వాళ్లు, నార్త్ ఇండియన్స్ సైతం బ్రహ్మి హావభావాలను సోషల్ మీడియాలో విస్తృతంగా వాడుతుండటం విశేషం. తాజాగా ఆస్ట్రేలియాతో భారత జట్టు గురువారం మూడో టెస్టును ఆరంభించగా.. వర్షం వల్ల మ్యాచ్ ఆగింది. ఈ సందర్భానికి ఏదో ఫన్నీగా ట్వీట్ వేయబోయిన ఓ ఆస్ట్రేలియా అమ్మాయి బ్రహ్మి ఎక్స్‌ప్రెషన్‌ను వాడుకోవడం విశేషం. దీన్ని బట్టి బ్రహ్మి క్రేజ్ ఏ స్థాయికి చేరిందన్నది అర్థం చేసుకోవచ్చు.