టికెట్ రేట్ల విషయంలో ‘లెనిన్’ ఆదర్శం

శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని ఆదివారాలు మరింత పెద్ద నెంబర్లు నమోదు చేసేందుకు పరుగులు పెడుతోంది. కొంచెం మిక్స్డ్ టాక్ తో మొదలైనప్పటికీ బుకింగ్స్ అంతకంతా పెరుగుతూ పోవడం చూసి అక్కినేని అభిమానులు సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయ్యగారు నెంబర్ వన్ అవ్వడానికి టైం పడుతుంది కానీ ఘనవిజయం సాధించారని గర్వంగా చెప్పుకోవడానికి లెనిన్ ఛాన్స్ ఇచ్చింది.

ఒక విషయంలో లెనిన్ ని ప్రత్యేకంగా మెచ్చుకోవాలి. టికెట్ ధరలు పెంచుకునే విధంగా సితార, అన్నపూర్ణ సంస్థలు చొరవ తీసుకోకపోవడం గొప్ప ఫలితాన్ని ఇస్తోంది. రెగ్యులర్ గా ఉండే రేట్లతో థియేటర్ ఫుట్ ఫాల్స్ ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చాలా బిసి సెంటర్లలో సింగల్ స్క్రీన్ బాల్కనీ 105 రూపాయలే ఉండగా కింది తరగతులు 80 నుంచి 50 రూపాయల వరకు ఉన్నాయి. ఇంత పెద్ద సినిమాని ఇలాంటి ధరలతో చూడటమంటే పండగేగా.

ఇదంతా ప్రత్యేకంగా చెప్పడానికి కారణం లేకపోలేదు. జిఓలు తెచ్చుకుని రేట్లు పెంచుకుంటే తప్ప పెట్టుబడి రికవరీ కాదని నిర్మాతలు భావించే ట్రెండ్ లో అలాంటి వాటి జోలికి వెళ్లకపోవడం మంచి పని. అఖిల్ ఇంకా పెద్ద స్టార్ కాలేదు కదాని కొందరు అనుకోవచ్చు. ఇదే సితార బ్యానర్ తీసిన అనగనగా ఒక రోజు, మ్యాడ్ స్క్వేర్ లాంటి సినిమాలకు ఏపీలో 50 రూపాయలు పెంపు తెచ్చుకోవడం మర్చిపోకూడదు. వాటిలో ఉన్నది వందల కోట్ల మార్కెట్లు ఉన్న స్టార్లు కాదు.

సో లెనిన్ మరికొందరికి రోల్ మోడల్ లా నిలవాలి. టికెట్ ధరలు సాధారణ స్థితిలో ఉంటే వీక్ డేస్ లో కూడా ఆక్యుపెన్సిలు పెరుగుతాయి. 200 రూపాయల టికెట్లతో వంద మంది సినిమా చూడటం కన్నా 100 రూపాయల రేటులో అయిదు వందల మంది చూస్తేనే ఎక్కువ కలెక్షన్ వస్తుందన్న లాజిక్ ని నిర్మాతలు గుర్తు పెట్టుకుంటే ప్రతి సినిమాకి పెంపుల గురించి ఆలొచించరు. లెనిన్ దూకుడు చూస్తుంటే వంద కోట్ల టార్గెట్ పెట్టుకునేలా ఉంది. అందుకుంటుందో లేదో చూడాలి.