అయ్యగారు ఫ్యాన్ వచ్చాడు… సందడి తెచ్చాడు

ఈ సోషల్ మీడియా కాలంలో ఎవరు ఎప్పుడు పాపులర్ అవుతారో.. వైరల్ అయిపోతారో చెప్పలేం. కొన్నేళ్ళ ముందు అక్కినేని కుర్రాడు అఖిల్ మీద వీరాభిమానాన్ని ప్రదర్శించడం ద్వారా సోషల్ మీడియాలో ఒక వ్యక్తి ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాడో గుర్తుండే ఉంటుంది. అఖిల్‌ను అయ్యగారు అని సంబోధిస్తూ.. అయ్యగారు నంబర్ వన్.. ఆయనే రావాలి.. అయ్యగారే కరెక్ట్.. అంటూ వీరావేశంతో ఆ అభిమాని చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.

ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా పాపులర్ అయి ఆ అభిమానికి ఎక్కడలేని గుర్తింపు తెచ్చిపెట్టింది. కాల క్రమంలో అదొక పెద్ద మీమ్ అయి కూర్చొంది. ఈ వీరాభిమాని విషయం అఖిల్ దృష్టికి కూడా వచ్చి.. ఆ అభిమాని గురించి చాలా ఎమోషనల్‌గా మాట్లాడాడు కూడా. ఇప్పటికీ అఖిల్‌ గురించి నెటిజన్లు మాట్లాడేటపుడు అయ్యగారు అని చేరుస్తున్నారంటే అదంతా ఆ అభిమాని సందడి వల్లే.

ఐతే మూడేళ్లకు పైగా అఖిల్ సినిమా రిలీజ్ కాకపోవడంతో ఆ వీరాభిమాని కూడా వార్తల్లో లేడు. ఐతే ఇప్పుడు అఖిల్ కొత్త చిత్రం ‘లెనిన్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో ఆ అభిమాని కూడా మళ్లీ తెరపైకి వచ్చాడు. ‘లెనిన్’ సినిమా థియేటర్ ఆఢుతున్న చోటికి వచ్చిన ఆ అభిమాని తన అభిమాన కథానాయకుడి కటౌట్‌ దగ్గర పూలమాల వేసి సందడి చేశాడు.

తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. అఖిల్‌కు ఎప్పట్లాగే తనదైన శైలిలో ఎలివేషన్ ఇచ్చాడు. ‘లెనిన్’ సినిమా కోసం అఖిల్ ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలుసు. ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి కూడా అక్కినేని కుర్రాడు ఎంతో శ్రమించాడు. టీం అంతా కూడా కష్టపడింది. ఖర్చు కూడా పెట్టుకుంది. కానీ వాళ్లంతా కలిసి సినిమాకు ఎంతో జోష్ తీసుకొచ్చారో అంతకుమించిన అటెన్షన్ ఈ రోజు అఖిల్ వీరాభిమాని రాకతో వచ్చింది. మరి ఇలాంటి అభిమానుల దాహాన్ని తీర్చేలా ‘లెనిన్’ పెద్ద హిట్టవుతుందేమో చూడాలి.