చెప్పిన డేటుకి షూటింగ్ పూర్తి చేయరు. రిలీజ్ డేట్ మళ్లీ మళ్లీ మార్చాల్సిన పరిస్థితి వస్తుంది. ఫైనల్ డేట్ దగ్గర పడుతుండగా హడావుడి పడతారు. రేయింబవళ్లు కష్టపడ్డామంటారు. సమయానికి ఫస్ట్ కాపీ రెడీ అవ్వదు. పోస్ట్ ప్రొడక్షన్ హడావుడి అవుతుంది. సెన్సార్ దగ్గర లేటవుతుంది. ఓవర్సీస్కు సమయానికి ప్రింట్లు అందవు. తీరా చూస్తే ఔట్ పుట్ అంతంతమాత్రంగా ఉంటుంది. బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితం రాదు.
ఈ మధ్య కాస్త పేరున్న ప్రతి సినిమాకూ ఇదే పరిస్థితి తలెత్తుతోంది. దీనిమీద చాలామంది సినీ పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయినా పరిస్థితి మారడం లేదు. కొన్ని నెలల ముందు లెనిన్ సినిమా ఈవెంట్లో సీనియర్ నటుడు, నిర్మాత అక్కినేని నాగార్జున ఈ విషయం మీద కొంచెం గట్టిగానే మాట్లాడాడు. పాత రోజుల్లో నెల రోజుల ముందు ఫస్ట్ కాపీ రెడీగా పెట్టుకునేవాళ్లమని చెబుతూ.. దర్శకులు మారాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు.
ఐతే మిగతా వాళ్లకు చెప్పి, తాను ఈ సూత్రాలను పాటించకుంటే బాగుండదు కదా. అందుకే తన వందో సినిమా కింగ్ 100 విషయంలో ప్లాన్ ప్రకారం అడుగులు వేస్తున్న విషయాన్ని ఆయన వెల్లడించారు. ఇట్లు అర్జున సక్సెస్ మీట్లో నాగ్.. తన సినిమా గురించి అప్డేట్ ఇచ్చారు. కింగ్ 100 డిసెంబరు 24న క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ఈ నెల చివరికి ఒక పాట మినహా పూర్తయిపోతుందని నాగ్ తెలిపారు.
విడుదలకు కొన్ని వారాల ముందే ఫస్ట్ కాపీ రెడీ అయిపోతుందని కింగ్ స్పష్టం చేశాడు. సమయానికి షూటింగ్ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్‌కు టైం ఉంటే.. 75 శాతం సినిమాను 150 శాతానికి తీసుకెళ్లవచ్చంటూ మరోసారి దర్శకులకు ఆయన హితవు పలికారు.
చివర్లో హడావుడి వల్ల ఏఐతో పని పూర్తి చేస్తున్నామనే విమర్శలు వస్తున్నాయని.. ఆ పరిస్థితి రాకుండా ప్లాన్ ప్రకారం పని చేసి పోస్ట్ ప్రొడక్షన్‌కు తగిన సమయం ఉండేలా చూడాలని నాగ్ సూచించారు. తమిళ దర్శకుడు రా.కార్తీక్ రూపొందిస్తున్న కింగ్ 100లో టబు కీలక పాత్ర పోషిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తమ సొంత బేనర్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాగ్ స్వయంగా నిర్మిస్తున్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
