టాలీవుడ్ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. అయిదు దశాబ్దాలకు పైగా కళారంగానికి ఎన్నో సేవలు అందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి గిరిబాబు శాశ్వత సెలవు తీసుకున్నారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ఇవాళ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. ప్రకాశం జిల్లా రావినూతల గ్రామం గిరిబాబు స్వస్థలం. నాటక రంగంలో ఎంతో అనుభవం గడించాక మిత్రుల ప్రోత్సాహంతో 1973 జగమే మాయతో ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.
తొలుత కొన్ని పరాజయాలు పలకరించినప్పటికీ పట్టువదలకుండా చేసిన ప్రయత్నాలు గిరిబాబుని తక్కువ సమయంలోనే బిజీ ఆర్టిస్టుగా మార్చాయి. దొరబాబు, జమీందార్ గారి అమ్మాయి, అన్నదమ్ముల అనుబంధం, జ్యోతి లాంటి సూపర్ హిట్స్ వెనుదిరిగి చూసే అవసరం లేకుండా చేశాయి. 1977 దేవతలారా దీవించండితో నిర్మాతగా మారి డెబ్యూతోనే ఘనవిజయం అందుకున్నారు.. 1978 కృష్ణ హీరోగా సింహగర్జన తీసి ఎన్టీఆర్ సింహబలుడుతో పోటీ పడటం అప్పట్లో సంచలనం. 1984 మెరుపుదాడి మరో సూపర్ డూపర్ హిట్. 1985 రణరంగంతో దర్శకుడిగా మారి తన ప్రతిభని నిరూపించుకున్నారు.
1990లో చిన్న కొడుకు బోసుబాబుని హీరోగా పరిచయం చేస్తూ భారీ బడ్జెట్ కౌబాయ్ సినిమా ఇంద్రజిత్ ని చిరంజీవి కొదమసింహంకి పోటీగా నిర్మించడం అప్పటి పత్రికల్లో హైలైట్ అయ్యింది. దురదృష్టవశాత్తు అది సక్సెస్ కాలేదు. నటుడిగా గిరిబాబు ఏనాడూ ఖాళీగా లేరు. విలన్, కమెడియన్ వేషం ఏదైనా తనదైన టైమింగ్ తో నిలబెట్టేవారు. ముగ్గురు కొడుకులు, సాహసమే నా ఊపిరి, బాలగోపాలుడు, కడప రెడ్డెమ్మ, ప్రేమఖైది, హలొ బ్రదర్, అల్లుడా మజాకా, ఆవిడా మా ఆవిడే ఆయన కెరీర్ లోని కొన్ని మచ్చుతునకలు.
సుమారు ఆరు వందలకు పైగా సినిమాల్లో నటించిన గిరిబాబు చివరిసారి 2023 అన్నీ మంచి శకునములేలో కనిపించారు. దర్శకత్వం వహించిన ఆఖరి చిత్రం 2008 స్నేహ ప్రధాన పాత్రలో వచ్చిన నీ సుఖమే నేను కోరుకున్నా. నాలుగు తరాల హీరో హీరోయిన్లతో ఎన్నో బ్లాక్ బస్టర్లతో భాగం పంచుకున్న గిరిబాబు వారసుడిగా రఘుబాబు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ప్రభుత్వాల నుంచి ఘనమైన పురస్కారాలు అందుకోకపోయినా గిరిబాబు ప్రేక్షకుల హృదయాల్లో సంపాదించుకున్న స్థానం శాశ్వతం.
Gulte Telugu Telugu Political and Movie News Updates
