క్రాక్‍ను వెంటాడుతోన్న రాజమౌళి నీడ

పోలీస్‍ పాత్రలు పలుమార్లు పోషించడం హీరోల్లో చాలా మందికి జరుగుతుంది. అయితే ఒక్కోసారి ఒక్కో పోలీస్‍ క్యారెక్టర్‍ ఆయా హీరో కెరియర్లో ఒక మైల్‍స్టోన్‍గా నిలిచిపోతుంది. సల్మాన్‍కు దబంగ్‍, పవన్‍కు గబ్బర్‍సింగ్‍ అలాంటి పాత్రలే. అయితే వాళ్లు చేసినవి ఎంటర్‍టైనింగ్‍ పోలీస్‍ పాత్రలు కాగా, రవితేజ ‘విక్రమార్కుడు’లో పవర్‍ఫుల్‍ పోలీస్‍ అంటే ఎలా వుండాలో చూపించాడు. రాజమౌళి తీర్చిదిద్దిన ఆ క్యారెక్టర్‍ ‘విక్రమ్‍ రాథోడ్‍’ పోలీస్‍ పాత్రల్లోనే చిరస్థాయిగా గుర్తుండిపోయేలా నిలిచిపోయింది. అందుకే రవితేజ పోలీస్‍ పాత్రలో కనిపించిన ప్రతిసారీ రాజమౌళి సృష్టించిన ‘విక్రమ్‍ రాథోడ్‍’ నీడ వెంటాడుతూ వుంటుంది. ‘పవర్‍’ సినిమాలో రవితేజ పోలీస్‍గా కనిపిస్తే దానిని ‘విక్రమార్కుడు’తోనే పోల్చి ఏమీ లేదని తేల్చేసారు.

ఇప్పుడు క్రాక్‍ సినిమాలో రవితేజ మళ్లీ విక్రమార్కుడిని తలపించే విధంగా కనిపిస్తున్నాడు. దీంతో మరోసారి రాజమౌళి సినిమాతో పోలికలు పెడుతున్నారు. విక్రమార్కుడితో పోల్చి చూస్తే ఏ పాత్ర అయినా తేలిపోయే ప్రమాదం వుంది కాబట్టి దయచేసి దాంతో పోల్చి చూడవద్దని రవితేజ పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాడు. అయితే ఆ పాత్ర గుర్తుకురాకుండా అలరించడమే కత్తి మీద సాము. అది గోపిచంద్‍ మలినేని ఎంతవరకు చేసాడనేది శనివారం బొమ్మ పడ్డాక తేలిపోతుంది.