పెద్ది థియేటర్ రన్ ముగిసిపోయిన కథ. రేపు అర్ధరాత్రి నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి ఇక టికెట్ల ద్వారా వచ్చే వసూళ్లు నామ మాత్రమే. అయితే మెయిన్ సెంటర్స్ లో ఇప్పటికీ డీసెంట్ కలెక్షన్లకు రాబడుతున్న వైనం గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. రాజమండ్రి కేంద్రంలో మంగళవారం సింగల్ స్క్రీన్ మ్యాటీ షోలలో 8 వేల రూపాయలకు పైచిలుకు వసూలు చేసిన సినిమాలు రెండే. ఒకటి నాగబంధం మరొకటి పెద్ది. రావు బహదూర్ సగం కూడా తెచ్చుకోలేదు.
అంటే ప్రతి చోట పరిస్థితి ఇలా ఉందని కాదు. చాలా చోట్ల డెఫిసిట్లు మొదలైన మాట కూడా వాస్తవమే. అయితే కేవలం రెండు వారాలకే ప్రమోషన్లను ఆపేసి ఒక సక్సెస్ మీట్ తో భరత వాక్యం పలకడం సమంజసంగా లేదని అభిమానులు భావిస్తున్నారు. సోషల్ మీడియా జమానాలో ఏదో ఒక సౌండ్ చేస్తూనే ఉండాలి. సామజిక మాధ్యమాల్లో ఏదో ఒక రూపంలో సినిమా గురించి మాట్లాడుకునేలా చేయాలి. ప్యాన్ ఇండియా మూవీస్ కి ఇది కనీసం నెల రోజులు జరగాలి.
సడన్ గా ఆపేయడానికి కారణాలు లేకపోలేదు. ఓవర్సీస్ రన్ ఆశించినంత రాలేదు. హిందీ వెర్షన్ ఫ్లాప్ అయ్యింది. తమిళనాడు కేరళలో సోసోగా ఆడింది. కర్ణాటక ఒకటే గుడ్డిలో మెల్లగా గట్టెక్కింది. ఏపీ తెలంగాణ వరకు నిరాశ పరచలేదు. ఆంధ్ర, నైజామ్ లో మంచి రెవిన్యూ చూసింది. సీడెడ్ లో నష్టాలు ఎక్కువగా రాలేదు. ఓవరాల్ గా మూడు వందల కోట్లకు పైగా కలెక్షన్లలో సింహభాగం ఏపీ తెలంగాణ నుంచే వచ్చాయి. ఇది రామ్ చరణ్ స్టార్ పవర్ ప్లస్ కంటెంట్ లోని బలం వల్ల వచ్చింది.
ఇక చూడాల్సిన కోణం విషయానికి వస్తే రామ్ చరణ్ లాంటి టయర్ 1 హీరోలు ఎక్కువ ఎమోషన్లు ఉండే కథల జోలికి వెళ్ళకపోవడం ఉత్తమం. నాని జెర్సీ చేయొచ్చు. కానీ అదే కథలో జూనియర్ ఎన్టీఆర్ ని ఊహించుకోలేం. హాయ్ నాన్న న్యాచురల్ స్టార్ కే కరెక్ట్. ఆ స్థానంలో ప్రభాస్ ని చూడగలమా. పెద్దిలో జరిగిన పొరపాటు ఇదే. రెండేళ్ల నిరీక్షణకు దక్కాల్సిన ఫలితం కాదిది. రంగస్థలంని మించకపోవడం ముమ్మాటికీ లోటే. దాన్ని తీర్చే బాధ్యత ఇప్పుడు సుకుమార్ మీద ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates