తమ సినిమాల విడుదలకు ముందు మేకర్స్ పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం మామూలే. కానీ అలాంటి స్టేట్మెంట్లు కొన్ని సినిమాల విషయంలోనే నిజమవుతుంటాయి. చాలాసార్లు మేకర్స్ చెప్పే మాటలకు, సినిమాల్లో ఉన్న కంటెంట్‌కు పొంతన ఉండదు. ప్రేక్షకులు కూడా అందరి మాటలనూ నమ్మరు. కొన్ని సినిమాల విషయంలో మాత్రం ఇలాంటి పెద్ద స్టేట్మెంట్లు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతాయి.
ఇరుముడి విషయంలో ఇలాగే అంచనాలు పెంచే ప్రయత్నం చేశారు దర్శకుడు శివ నిర్వాణ, హీరో రవితేజ. తన సినిమాల గురించి ఎప్పుడూ మరీ గొప్పగా చెప్పుకోని శివ నిర్వాణ.. ఇరుముడి విషయంలో మాత్రం చాలా పెద్ద స్టేట్మెంటే ఇచ్చేశాడు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇంత ఇంటెన్స్ ఫ్యామిలీ డ్రామా ఇంత వరకు రాలేదని అతను ఇరుముడి ప్రి రిలీజ్ ఈవెంట్లో ధీమాగా చెప్పాడు.
సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నో థ్రిల్లర్ సినిమాలు వచ్చాయని.. అందులో బెస్ట్ మూవీస్ చాలా ఉన్నాయని.. కానీ ఒక ఫ్యామిలీ మూవీ థ్రిల్లింగ్‌గా, ఇంటెన్స్‌గా ఉండడం అరుదని.. ఇరుముడి ఆ కోవకు చెందిన సినిమానే అని.. తాను ఇలాంటి సినిమాను ఇంత వరకు చూడలేదని అతను చెప్పడం విశేషం.
టైటిల్, పాటలు చూసి ఇదేదో అయ్యప్పస్వాములకు సంబంధించిన సినిమా అనుకోవద్దని.. ఈ సినిమా మొదట్లో కొంచెం సరదాగా ఉన్నా.. తర్వాత చాలా ఇంటెన్స్‌గా, సీరియస్‌గా మారుతుందని.. ప్రేక్షకులు అందుకు ప్రిపేరై రావాలని.. సినిమా అయ్యాక ఒక పావుగంట పాటు ఆడియన్స్ ఒక ట్రాన్స్‌లో ఉండిపోతారని.. బలమైన ఎమోషన్ వారిని వెంటాడుతుందని శివ నిర్వాణ చెప్పాడు.
ఇక రవితేజ మాట్లాడుతూ.. ఈ సినిమాలో కొత్త రవితేజను చూస్తారని.. ఇరుముడి తన అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులకు కూడా పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుందని అన్నాడు. ఇంతకుమించి సినిమా గురించి ఎక్కువ మాట్లాడనని.. దర్శకుడు శివ నిర్వాణ గురించి కూడా సక్సెస్ మీట్లోనే మాట్లాడతానని రవితేజ అన్నాడు. మరి హీరో, డైరెక్టర్ చెబుతున్నంత గొప్పగా ఇరుముడి ఉంటుందేమో ఈ నెల 21న చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates