వార‌ణాసి కోసం ఇంకో ద‌ర్శ‌కుడు?


అదేంటి.. వార‌ణాసి సినిమాకు రాజ‌మౌళి ద‌ర్శ‌కుడు క‌దా, ఆయ‌న‌తో పాటు ఈ చిత్రానికి మ‌రో డైరెక్ట‌ర్ ప‌ని చేయ‌డం ఏంటి అనుకుంటున్నారా? ఇక్క‌డే ఉంది ట్విస్ట్. ఈ సినిమా యూనిట్‌తో పాటు ఇంకో ద‌ర్శ‌కుడు ప‌ని చేస్తున్న మాట నిజ‌మే. ఐతే అత‌డికి వార‌ణాసి సినిమా తీయడంలో ఎలాంటి పాత్ర లేదు. ఆ ద‌ర్శ‌కుడు చేస్తున్న‌ ప‌ని.. వార‌ణాసి మేకింగ్ మీద డాక్యుమెంట‌రీ తీయడం. గోగితా చిక్వాడ్జే అనే ద‌ర్శ‌కుడిని ఇందుకోసం హైర్ చేసుకుంది రాజ‌మౌళి అండ్ టీమ్.

రాజ‌మౌళి సినిమాల‌నే కాదు.. ఆయ‌న సినిమాల మేకింగ్‌ను కూడా ప్రేక్ష‌కులు అమితాస‌క్తితో చూస్తారు. ఆయ‌న కెరీర్లో ఎపిక్ మూవీగా నిలిచిన బాహుబ‌లి సినిమాకు సంబంధించిన మేకింగ్ విశేషాల‌తో ఈ మ‌ధ్య కూడా ఒక డాక్యుమెంటరీని నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేస్తే మంచి వ్యూయ‌ర్‌షిప్ వ‌చ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోల‌కు కూడా మంచి స్పందన వ‌చ్చింది.

ఐతే వార‌ణాసి మేకింగ్ వీట‌న్నింటినీ మించి ఉండ‌బోతోంద‌ని తెలుస్తోంది. హాలీవుడ్ సినిమాల‌కు ఏమాత్రం త‌గ్గ‌ని విజువ‌ల్ వండ‌ర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్న జ‌క్క‌న్న అండ్ టీమ్.. ఇందుకోసం ఆరంభం నుంచి తాము ప‌డుతున్న క‌ష్టాన్ని క్యాప్చ‌ర్ చేయిస్తోందట‌. వ‌ర్క్ షాప్స్ ద‌గ్గ‌ర్నుంచి అన్నీ రికార్డ్ చేయించి.. ప్రాప‌ర్ డాక్యుమెంట‌రీగా తీర్చిదిద్దేందుకు గోగితా అనే ద‌ర్శ‌కుడిని నియ‌మించుకుంది టీం.

డాక్యుమెంట‌రీలు తీయ‌డంలో మంచి నైపుణ్యం ఉన్న గోగితా ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నట్లు ఐఎండీబీ రిపోర్ట్ చేయ‌డంతో ఈ వార్త నిజ‌మే అని తేలింది. బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్‌ల‌ను మించి వార‌ణాసి గ్లోబ‌ల్‌గా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంద‌ని న‌మ్ముతున్న టీం.. ఆ త‌ర్వాత ఈ సినిమా మేకింగ్ మీద డాక్యుమెంట‌రీ రిలీజ్ చేస్తే దానికీ అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తుంద‌ని భావిస్తోంది. వార‌ణాసి డిజిట‌ల్ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను డాక్యుమెంట‌రీతో క‌లిపి భారీ రేటుకు అమ్మేలా జ‌క్క‌న్న ప్లాన్ చేసిన‌ట్లు స‌మాచారం.