తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా అనుకున్నారు. కానీ విజయ్ గత దశాబ్ద కాలంలో ఇంతింతై అన్నట్లు ఎదిగిపోయి సూపర్ స్టార్ మించిన స్టార్ అయ్యాడు. ఐతే నంబర్ వన్ హీరోగా ఉంటూ ఫిలిం ఇండస్ట్రీని విడిచిపెట్టి రాజకీయాల్లోకి వెళ్లిపోయాడు విజయ్.
రాజకీయాల్లో ఆశించిన ఫలితాలు రాకపోయి ఉంటే తిరిగి సినిమాల్లోకి వచ్చేవాడేమో కానీ.. అనూహ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించడంతో విజయ్ మళ్లీ సినిమాల వైపు చూడడం కష్టమే. ఈ పరిస్థితుల్లో విజయ్ ఖాళీ చేసిన నంబర్ వన్ స్థానం ఎవరిది అనే ప్రశ్న తలెత్తింది. ఇప్పటికీ రజినీ సినిమాల్లో కొనసాగుతున్నారు. ఆయనకు సరైన సినిమా పడితే రికార్డులు బద్దలువుతాయి. కానీ వయసు, ఆరోగ్యం రీత్యా ఆయన కెరీర్ చివరి దశలో ఉందన్నది వాస్తవం. రాబోయే కొన్నేళ్లలో ఆయన రిటైర్మెంట్ తీసుకునే అవకాశాలే ఎక్కువ.
ఈ నేపథ్యంలో విజయ్ తర్వాత కిరీటం ఎవరిది అనే ప్రశ్న తలెత్తింది. మామూలుగా అయితే అందరూ అజిత్ వైపు చూసేవారు. కానీ ఆయన కెరీర్ అంత గొప్పగా ఏమీ సాగట్లేదు. పైగా ఈ మధ్య అజిత్ బాగా సినిమాలు తగ్గించేశాడు. ఈ నేపథ్యంలో తల భవిష్యత్ కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి టైంలో అదను చూసి బాక్సాఫీస్ దగ్గర తన సత్తాను చూపిస్తున్నాడు సూర్య. వరుస ఫ్లాపుల నుంచి బయటపడి ఈ వేసవిలో ‘కరుప్పు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టాడు ఈ విలక్షణ నటుడు. అది ఆయన కెరీర్లో తొలి 300 కోట్ల సినిమాగా నిలిచింది.
ఈ సినిమా రిలీజైన మూడు నెలలకే ఇప్పుడు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో మరో బ్లాక్ బస్టర్ దిశగా అడుగులేస్తున్నాడు. ఈ చిత్రానికి తెలుగు, తమిళ భాషల్లో మంచి స్పందన వస్తోంది. బాక్సాఫీస్ దగ్గర అనుకూల పరిస్థితుల దృష్ట్యా ఇది క్లాస్ సినిమా అయినా సరే భారీ వసూళ్లు రాబడుతోంది. ఈ చిత్రం కూడా కరుప్పు కలెక్షన్లకు దీటుగా నిలిచేలా ఉంది. వరుసగా రెండు భారీ విజయాలతో తమిళంలో నంబర్ వన్ స్థానానికి గట్టి పోటీదారుగా మారాడు సూర్య. అజిత్ తన కొత్త చిత్రం ‘డేర్ డెవిల్’తో సత్తా చాటకపోతే సూర్యనే తమిళ నంబర్ వన్ హీరో స్థానాన్ని చేజిక్కించుకునే అవకాశముంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates